ప్రపంచ బ్యాంకు జీతగాడని విమర్శించారు
విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనన్న సీఎం చంద్రబాబు;
విద్యుత్ రంగంలో తొలి సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభలో ఇంధన శాఖపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ..1998లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాం. డిస్ట్రిబ్యూషన్, జనరేషన్, ట్రాన్స్‌మిషన్‌గా విభజించాం. ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం. కరెంట్ కొరత లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని తయారుచేశాం. నాడు తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలను చూసి సంతోషించాం. వ్యవసాయానికి యూనిట్‌కు వసూలు చేసే పరిస్థితి నుంచి శ్లాబ్ రేట్‌తో రైతులను ఆదుకున్నది టీడీపీ ప్రభుత్వమే. 2014లో రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల కరెంట్ కొరత ఉండేది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాన్ని సవాల్‌గా తీసుకున్నాను. 2014 డిసెంబర్‌కు ఎక్కడా కొరత లేకుండా చేసి... జనవరి 2018 నాటికి మిగులు విద్యుత్ సాధించిన రాష్ట్రంగా మార్చాను అన్నారు. ఇప్పుడు గర్వంగా చెబుతున్నా.. 9 గంటలు వ్యవసాయానికి కరెంటు ఇస్తున్నాం. నేను 1995లో మొదటిసారి సీఎం అయ్యేసరికి 10-15 గంటల పాటు కరెంట్ కోతలుండేవి. పరిపాలన ఎలా ఉండాలో ఆలోచించా. అందుకు అనుగుణంగా ప్రణాళికలతో ముందుకెళ్లాను. మీటర్ రీడింగ్ కోసం స్పాట్ బిల్లింగ్ తీసుకొచ్చాం. ప్రపంచం మొత్తం అధ్యయనం చేశాను. ప్రపంచ బ్యాంకు జీతగాడు అని నాపై విమర్శలు చేశారని చంద్రబాబు అన్నారు.