బాబు, పవన్.. ఆ రహస్యం బయట పెట్టలేదేం..?
పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇటీవల చాలా సార్లు భేటీ అయ్యారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటున్నారు. అయితే బీజేపీ విషయంలోనే ముడిపడటంలేదు.
హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సహజంగా ఇలాంటి చర్చల తర్వాత ఇద్దరూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత రెండు పార్టీలు వేర్వేరుగా ప్రెస్ నోట్ లు విడుదల చేస్తాయి.. లేదా సోషల్ మీడియాలో ఆ భేటీ ఎంత అవసరమో తెలియజేస్తాయి. కానీ ఈసారి జనసేన నుంచి కనీసం ఫొటోలు కూడా బయటకు రాలేదు, టీడీపీ నుంచి మాత్రం ఫొటోలు వదిలారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితుల పై, ప్రజా సమస్యల పై చంద్రబాబు, పవన్ చర్చించారని చెప్పి సరిపెట్టారు.
ఏం చర్చించారు..?
ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల్లో రజినీకాంత్ మాటలు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. వైసీపీ నేతలు ఓ రేంజ్ లో రజినీపై విరుచుకుపడ్డారు. పనిలో పనిగా పవన్ ని పక్కనపెట్టారంటూ మాజీ మంత్రి కొడాలి నాని ఓ అనుమానం రేకెత్తించారు. చంద్రబాబు వ్యవహారంలో పవన్ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆ మాటలన్న కాసేపటికే పవన్, చంద్రబాబు.. హైదరాబాద్ లో భేటీ అయ్యారు. కానీ మీడియాతో మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటమే ఇక్కడ విశేషం.
పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇటీవల చాలా సార్లు భేటీ అయ్యారు. ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమంటున్నారు. అయితే బీజేపీ విషయంలోనే ముడిపడటంలేదు. బీజేపీ కేవలం పవన్ పొత్తుని మాత్రమే అంగీకరిస్తోంది. టీడీపీని దూరం పెట్టింది. ఇటీవల చంద్రబాబు, మోదీని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడినా బీజేపీ నుంచి మాత్రం స్పందన లేదు. ఈ దశలో పదే పదే పవన్, చంద్రబాబు కలిస్తే ఉపయోగమేంటనే వాదన వినపడుతోంది. కేవలం రాజకీయ చర్చల్లో ఉండేందుకే పవన్, చంద్రబాబు కలిశారని, అంతకు మించి వేరే చర్చలేవీ జరగలేదనేది వైరి వర్గం విమర్శ. జనసైనికులకు మాత్రం టీడీపీతో జనసేన పొత్తు తప్పదనే క్లారిటీ వచ్చినట్టయింది.