వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా విచారణ చేపట్టండి
వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా విచారణ చేపట్టడం వల్ల అప్పీలుదారులు, ఫిర్యాదుదారులు, పీఐఓలు, అధికారులకు వ్యయప్రయాసలు తగ్గిపోతాయని చెప్పారు హీరాలాల్ సమారియా.
ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ లో వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా విచారణ చేపడితే బాగుంటుందని కేంద్ర సమాచార కమిషనర్ హీరాలాల్ సమారియా సూచించారు. వ్యక్తిగత పనులమీద ఏపీకి వచ్చిన ఆయన ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ ఆర్.ఎం.భాషాతోపాటు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పలువురు కమిషనర్లు, సిబ్బందితో ఆయన స్నేహపూర్వకంగా ముచ్చటించారు. గతంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో తన అనుభవాలు, అనుభూతులను మరోసారి నెమరు వేసుకున్నారు. ఏపీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సమారియా.
వీడియో కాన్ఫరెన్స్ విచారణ ఎందుకంటే..?
వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా విచారణ చేపట్టడం వల్ల అప్పీలుదారులు, ఫిర్యాదుదారులు, పీఐఓలు, అధికారులకు వ్యయప్రయాసలు తగ్గిపోతాయని, అదే సమయంలో విచారణల వాయిదా కూడా పరిమితంగానే ఉంటుందని చెప్పారు హీరాలాల్ సమారియా. వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీ విధానం తీసుకు రావడానికి అప్పీళ్లు, ఫిర్యాదుల నిర్వహణకు.. ఇ-ఫైల్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వానికి బడ్జెట్ భారాన్ని తగ్గించేందుకు కమిషన్ కు సొంత భవనం ఏర్పాటు చేసుకోవాలన్నారు.
హీరాలాల్ సమారియా గతంలో గుంటూరు జిల్లాకు కలెక్టర్ గా పనిచేయడంతోపాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు కీలక పదవులు నిర్వహించారు. సమర్థవంతమైన అధికారిగా ఆయన అందరి మన్ననలు పొందారు. కింది స్థాయి సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం కేంద్ర సమాచార కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.