అరసవల్లి, తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు
పర్వదినం సందర్భంగా తిరుమలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయానికి పోటెత్తిన భక్తులు;
జగతికి వెలుగులు పంచే సూర్యభగవానుడి పండుగ రథసప్తమి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పర్వదినం సందర్భంగా తిరుమలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేవాలయానికి భక్తులు పోటెత్తారు. తిరుమలలో సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్పస్వామిని ఊరేగించారు. భారీగా భక్తులు తరలిరావడంతో తిరుమలలో రద్దీ నెలకొన్నది.
అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో జరుగుతున్ వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, జడ్పీ ఛైర్మన్ పిరియా విజయ, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, మామిడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 4 వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించనున్నారు. ఆదిత్యుడి నిజరూప దర్శనం కోసం సోమవారం నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడినెలకొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రథసప్తమి వేడుకలు
రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలంశ్రీసీతారామచంద్ర ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉదయం స్వామి వారికి ఆలయ అర్చకులు సుప్రభాత సేవ, తిరువారాధనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరువీధి సేవ ఘనంగా జరిగింది. స్వర్ణసూరి వాహణంపై తిరువీధుల్లో విహరిస్తున్న రామచంద్ర స్వామికి భక్తులు ధూపదీప నైవేధ్యాలు సమర్పించారు. సాయంత్రం స్వామివారు స్వర్ణచంద్ర వాహనంపై తిరువీధుల్లో విహరించనున్నారు. తిమ్మాపురంలో సూర్యభగవానుడి పాదాలను సూర్యకిరణాలు తాకాయి.