బీజేపీకి ప్రియమైన శత్రువు జగన్..
జాతీయ మీడియాలో చంద్రబాబు, మోదీకి జై కొట్టినా, మధ్యలో పవన్ కల్యాణ్ తో రాయబారాలు నడిపించినా.. బీజేపీ అధినాయకత్వం చలించడంలేదు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చడం మినహా ప్రయోజనం ఏమీ ఉండదు. అసెంబ్లీ, లోక్ సభలో కనీసం ఒక్క సీటయినా దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. అదే టీడీపీ, జనసేనతో కలసిపోతే, కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే ఒకటీ అర సీటు దక్కే అవకాశముంది. ఆ విషయం బీజేపీ అధిష్టానానికి కూడా బాగా తెలుసు. కానీ వారు ఏపీలో టీడీపీని దగ్గరకు రానిచ్చే విషయంలో ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుతో పొత్తుకి ఇష్టపడటం లేదు.
ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలనేదే బీజేపీ బలమైన కోరిక. అదే సమయంలో టీడీపీ బలపడకూడదనేది కూడా ఆ పార్టీ నాయకుల ఆకాంక్ష. కేంద్రంలో ఏదయినా తేడా కొడితే, ఏపీనుంచి కచ్చితంగా వైసీపీ తమకే మద్దతిస్తుందని బీజేపీకి తెలుసు. కాంగ్రెస్ పై జగన్ కి ఉన్న కక్షతో ఆ పార్టీకి కానీ, ఆ పార్టీ నేతృత్వం వహించే కూటమికి కానీ వైసీపీ దూరంగానే ఉంటుంది. అందుకే ఏపీలో వైసీపీ ఓటు, కేంద్రంలో బీజేపీకే అనేది వారి లెక్క. ఒకవేళ ఏపీలో టీడీపీ బలపడితే చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడానికి వీల్లేదు. ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. ఆ తర్వాత కేంద్రంలో హంగ్ ఏర్పడితే కచ్చితంగా ఆయన సొంత లాభం చూసుకుంటారు. కాంగ్రెస్ తో కలవడానికి కూడా మొహమాటపడరు అనే విషయం అందరికీ తెలుసు. అంటే చంద్రబాబుని సపోర్ట్ చేస్తే.. ఫలితం పూర్తిగా తమకే అనుకూలంగా ఉంటుందని బీజేపీ అనుకోడానికి వీల్లేదు.
పొత్తులపై పీటముడి అందుకే..
జాతీయ మీడియాలో చంద్రబాబు, మోదీకి జై కొట్టినా, మధ్యలో పవన్ కల్యాణ్ తో రాయబారాలు నడిపించినా.. బీజేపీ అధినాయకత్వం చలించడంలేదు. టీడీపీతో జతకట్టి, వైసీపీకి నష్టం కలిగించాలనుకోవడంలేదు. ఏపీలో ఒకటీ అరా సీట్లు బీజేపీ లక్ష్యం కాదు. కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడమే ఆ పార్టీ ముందున్న అతి పెద్ద టాస్క్. అందుకే టీడీపీని దూరం పెడుతోంది, జగన్ కి కోపం రాకుండా చూసుకుంటోంది. ఏపీలో బీజేపీ, వైసీపీ వైరి వర్గాలే అయినా.. జగన్ మాత్రం బీజేపీ అధిష్టానానికి ప్రియమైన శత్రువు.