మార్గదర్శికి బీజేపీ సపోర్టా?

మార్గదర్శి యాజమాన్యంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందని జీవీఎల్ ఆరోపించారు . ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాయటంలేదన్న ఏకైక కారణంతోనే ప్రభుత్వం మార్గదర్శిపై కేసులు పెట్టి కక్ష సాధింపులకు దిగిందన్నారు.

Advertisement
Update:2023-06-19 10:31 IST

బీజేపీ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. ఒకవైపు మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో లక్షలాది మంది ఖాతాదారులను ఛైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజ మోసం చేశారని సీఐడీ కేసులు నమోదుచేసి విచారణ జరుపుతోంది. ఇదే విషయమై గడచిన 17 ఏళ్ళుగా హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో విచారణ కూడా జరుగుతోంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ దాదాపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ సమయంలో బీజేపీ మార్గదర్శి చిట్ ఫండ్స్ కు మద్దతుగా నిలుస్తున్నట్లుంది.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాటలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. జీవీఎల్ మాట్లాడుతూ.. మార్గదర్శిని ప్రభుత్వం వేధిస్తున్నట్లు మండిపడ్డారు. మార్గదర్శి యాజమాన్యంపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాయటంలేదన్న ఏకైక కారణంతోనే ప్రభుత్వం మార్గదర్శి పై కేసులు పెట్టి కక్షసాధింపులకు దిగిందన్నారు. ఒకవైపేమో మార్గదర్శిలో మోసాలు జరిగినట్లు సీఐడీ అధికారులు ప్రకటించారు.

నిబంధనలకు విరుద్ధంగా తాము వ్యాపారం చేస్తున్నట్లు సీఐడీ విచారణలో రామోజీ, శైలజ చెప్పిన సమాధానాలతోనే అర్థ‌మవుతోంది. మార్గదర్శి వ్యాపారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలు కాకుండా తమ సొంత మార్గదర్శకాల ప్రకారమే వ్యాపారం చేస్తున్నట్లు శైలజ పదేపదే చెప్పారు. మార్గదర్శి నుండి వేల కోట్ల రూపాయలను దారి మళ్ళించి ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఇద్దరూ అంగీకరించారు. ఏ ఏ కంపెనీల్లో మార్గదర్శి నిధులను పెట్టుబడులు పెట్టిందో సీఐడీ ప్రెస్‌నోట్‌లో స్పష్టంగా కొంత సమాచారం అందించింది. రూ.వెయ్యి కోట్ల ఆస్తులను సీఐడీ జప్తు కూడా చేసింది.

ఇదే విషయమై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. నిబందనలకు విరుద్ధంగా రామోజీ మార్గదర్శిని ఏర్పాటుచేసి వ్యాపారం చేస్తున్నట్లు దాదాపు నిర్ధారణైపోయిందంటున్నారు. ఆ విషయాన్ని కోర్టు అధికారికంగా చెప్పటమే మిగిలుందట. ఇలాంటి సమయంలో జీవీఎల్ మార్గదర్శికి మద్దతుగా మాట్లాడటమే ఆశ్చర్యంగా ఉంది. మార్గదర్శి విషయంలో ఏమి జరుగుతోందో తెలియ‌నంత అమాయకుడు అయితే కాదు జీవీఎల్. విచారణను ఎలా తప్పించుకోవాలో అర్థంకాక రామోజీ తలపట్టుకుంటున్న విషయంతోనే తెలిసిపోతోంది అక్రమాలకు పాల్పడినట్లు. మరి ఇంతకాలం మౌనంగా ఉన్న జీవీఎల్‌కు ఏమైందో ఏమో సడెన్‌గా మార్గదర్శిని వెనకేసుకొచ్చారు.

Tags:    
Advertisement

Similar News