చంద్రబాబుకు షాక్‌.. కాంగ్రెస్‌తో వామపక్షాలు పొత్తు

ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడేది తమ పార్టీ మాత్రమేనని, ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నామని షర్మిలారెడ్డి చెప్పారు.

Advertisement
Update:2024-02-23 16:15 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయాలు కీల‌క మలుపులు తిరుగుతున్నాయి. అధికార‌ వైసీపీని ఎదుర్కోవ‌డానికి జ‌న‌సేన‌తో టీడీపీ జ‌త‌క‌డితే.. తాజాగా కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్‌తో పొత్తులోకి వచ్చాయి. సీపీఎం నాయకుడు శ్రీనివాస్‌ రావు, సీపీఐ నాయకుడు రామకృష్ణ ఈ రోజు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డితో సమావేశమై పొత్తులపై నిర్ణయానికి వచ్చారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడిన స్థితిలో వామపక్షాలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ సందర్భంగా షర్మిల వైసీపీ, టీడీపీలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీలు బీజేపీకి బానిసలని, బీజేపీకి తొత్తులుగా మారి ఆంధ్ర రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నాయని ఆమె అన్నారు.

ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడేది తమ పార్టీ మాత్రమేనని, ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నామని ఆమె చెప్పారు. త్వరలో అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని ఆమె చెప్పారు. కలిసి పోరాడే అంశంపై చర్చలు జరిపామని, తామంతా కలిసి పోరాటం చేస్తామని ఆమె చెప్పారు. అనంతపురం సభకు సీపీఐ, సీపీఎంలను ఆహ్వానించినట్లు ఆమె తెలిపారు. ప్రత్యేక హోదాపై తిరుపతిలో ఇచ్చిన హామీపై ప్రధాని మోడీ మాట మార్చారని ఆమె అన్నారు. హోదా విషయంలో వైఎస్‌ జగన్‌, చంద్రబాబు ఇద్దరు కూడా విఫలమయ్యారని ఆమె విమర్శించారు.

బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని, తమ పోరాటం బీజేపీ, వైసీపీ, టీడీపీల మీదనే అని సీపీఎం నాయకుడు శ్రీనివాస్‌ రావు అన్నారు. ఒక్క శాతం ఓట్లు కూడా లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తోందని ఆయన అన్నారు. బీజేపీపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు ఇప్పుడు పొర్లు దండాలు పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పోటీ చేస్తామని ఆయన చెప్పారు.

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తారని, ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు బీజేపీకి భయపడుతున్నాయని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. జగన్‌, చంద్రబాబు, పవన్‌ ముగ్గురు కూడా బీజేపీకి దాసోహమంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News