కూటమి మార్కు.. కీలక నేతలందరూ ప్రజల్లోనే
కూటమి నేతలది ఆరంభ శూరత్వమేనా, అంతిమ ప్రయోజనం కోసం చేసే ప్రయత్నమా అనేది తేలాల్సి ఉంది.
కూటమి అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా కీలక నేతలంతా పాలనలో తమ మార్కు చూపించాలనుకుంటున్నారు. గత ప్రభుత్వంలో జరగనిది, ప్రజలు కోరుకుంటున్నది వారికి అందించాలని ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే కీలక నేతలు ప్రజలతో, ప్రజల మధ్య ఉండేందుకు టైమ్ కేటాయిస్తున్నారు. నారా లోకేష్ వరుసగా ప్రజా దర్బార్ లు నిర్వహించగా, పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం ప్రారంభించారు. ఇక చంద్రబాబు కూడా ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించేందుకు సమయం కేటాయిస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉండగా జగన్ పాదయాత్రలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. అధికారంలోకి వచ్చాక తండ్రిబాటలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారని ఆశించారంతా. కానీ ఆయన జనంలోకి రాలేదు. తీరా ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేలను గడప గడపకు పంపించారు, వాలంటీర్లను ప్రతి ఇంటికీ వెళ్లమన్నారు, గృహ సారథులను ఇంటింటికీ తిప్పారు. ఎన్నికల తేదీ దగ్గరపడ్డాక సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు, బస్ యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ప్రజలతో మమేకమయ్యారు. అంటే జగన్ ఎన్నికల సమయంలోనే జనంలో ఉన్నారు. మిగతా సమయాల్లో ఆయన అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఆ తప్పు చేయకూడదని కూటమి నేతలు డిసైడ్ అయ్యారు. అందుకే ఇప్పటినుంచే జనంలో ఉండేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
సీఎం స్థాయి వ్యక్తి నేరుగా ప్రజల వద్ద వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరిస్తామని చెబితే కొండంత భరోసా లభించినట్టు లెక్క. చంద్రబాబు అదే చేస్తున్నారు. నేరుగా ప్రజల వద్ద అర్జీలు తీసుకుంటున్నారు. పవన్ కల్యాణ్ కూడా ఎక్కడి సమస్యలు అక్కడ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేరుగా అధికారులకు ఫోన్ చేసి బాధితుల తరపున మాట్లాడుతున్నారు. నారా లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో ఆల్రడీ జనంతో మమేకమయ్యారు. ఈ మార్పు తాత్కాలికమే అయితే దానివల్ల వచ్చే ఫలితం కూడా తాత్కాలికంగానే ఉంటుంది. పేరేదయినా ఈ ప్రజా దర్బార్ ల వల్ల ప్రజలకు అంతిమంగా ప్రయోజనం కలిగితే మాత్రం నేతలతోపాటు పార్టీకి కూడా మంచి పేరొస్తుంది. మరి కూటమి నేతలది ఆరంభ శూరత్వమేనా, అంతిమ ప్రయోజనం కోసం చేసే ప్రయత్నమా అనేది తేలాల్సి ఉంది.