మళ్లీ తెరపైకి అప్పలరాజు.. ఈసారి ఏమన్నారంటే..?
బీఆర్ఎస్ తో పవన్ కు రహస్య ఒప్పందం ఏంటన్నారు. కోట్ల రూపాయల ఒప్పందం జరిగిందని మీడియాలో చూశానని, అది నిజమే అనిపిస్తోందని చెప్పారు మంత్రి అప్పలరాజు.
ఇటీవల ఏపీలో మంత్రి అప్పలరాజు పేరు మారుమోగిపోతోంది. ఆయనకు మంత్రి పదవి ఊడిపోతోందంటూ ఆమధ్య ఊహాగానాలు వినిపించాయి. సీఎం జగన్ పిలిపించుకుని మాట్లాడే సరికి అదే నిజమనుకున్నారంతా. కానీ ఆయన అదృష్టం బాగుండి వేటు తప్పించుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడంలో కాస్త శృతిమించే సరికి ఏపీ సీఎంఓ కార్యాలయం అప్పలరాజుకి తలంటింది. ఇటీవల కాలంలో ఓ మంత్రికి ఇలా సీఎంఓ నుంచి హెచ్చరికలు రావడం ఇదే తొలిసారి. చంద్రబాబుని, జగన్ ని తిడితే అధిష్టానం సెబ్బాష్ అంటూ మెచ్చుకుంటుంది, అదే ఊపులో ఆయన తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు మాత్రం సొంత పార్టీనుంచే హెచ్చరికలొచ్చాయి. తాజాగా మళ్లీ అప్పలరాజు తెరపైకి వచ్చారు. ఈసారి పవన్ కల్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు.
అవమానానికి బదులు చెప్పలేవా..?
తెలంగాణ మంత్రులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు మంత్రి సీదిరి అప్పలరాజు. తెలంగాణ మంత్రి హరీష్ రావును పవన్ వెనుకేసుకొచ్చి మాట్లాడుతున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. బీఆర్ఎస్ తో పవన్ కు రహస్య ఒప్పందం ఏంటన్నారు. కోట్ల రూపాయల ఒప్పందం జరిగిందని మీడియాలో చూశానని, అది నిజమేమోనని అనిపిస్తోందని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ తో ఏపీలో చంద్రబాబుతో పవన్ కి ఉన్న లాలూచీ ఏంటన్నారు మంత్రి అప్పలరాజు. సీఎం జగన్ ని తక్కువచేసి పవన్ మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
ఓవైపు హరీష్ రావు తాను విమర్శించింది ఏపీ ప్రజల్ని కాదని, నాయకులనేనని స్పష్టం చేశారు. దమ్ముంటే ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చుకోవాలని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, పోలవరం కట్టి చూపించాలని సవాల్ విసిరారు. వీటికి సమాధానం చెప్పకుండా మధ్యలో పవన్ ని టార్గెట్ చేశారు మంత్రి అప్పలరాజు. తెలంగాణ ప్రజలకు వైసీపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న పవన్ కి మరోసారి ఘాటు విమర్శలు ఎదురయ్యాయి. వీటిపై జనసేనాని స్పందిస్తారో లేదో చూడాలి.