ఏపీ రాజకీయాల్లో అందరూ తేలు కుట్టిన దొంగలే..

బీజేపీ అంటే ఏపీలోని అన్ని పార్టీలకూ భయంతో కూడిన గౌరవం వల్ల వచ్చిన భక్తి ఏర్పడింది. పక్క రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ వికృత క్రీడపై కూడా స్పందించలేని అచేతన స్థితిలో అన్ని పార్టీలు ఉండటం దారుణం.

Advertisement
Update:2022-10-30 08:05 IST

ఏపీ రాజకీయాలు మరీ విడ్డూరంగా తయారయ్యాయి. రాజకీయ పార్టీలు మరీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. పక్క రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరమాడి అడ్డంగా దొరికిపోయినా ఏపీనుంచి పల్లెత్తు మాట కూడా వినపడలేదు. కనీసం ఆ సంఘటన గురించి నాయకులు స్పందించనూ లేదు. ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది, పొరుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ దుర్మార్గాన్ని ఎండగట్టాయి, కానీ ఏపీలోని అధికార, ప్రతిపక్ష, ప్రతిపక్షాలకు మిత్రపక్ష పార్టీలు కూడా ఎక్కడా స్పందించలేదు, అందరూ తేలుకుట్టిన దొంగలేనని నిరూపించుకున్నారు.

ఎందుకొచ్చిన తంటా..?

బీజేపీ అంటే ఏపీలోని అన్ని పార్టీలకూ భయంతో కూడిన గౌరవం వల్ల వచ్చిన భక్తి ఏర్పడింది. ఎంపీ ల్యాడ్స్ నిధులిచ్చినా మీ ఎమ్మెల్యే పనిచేయలేదంటూ కేంద్ర మంత్రి జనం ముందే చీవాట్లు పెడుతున్నా.. హాయిగా నవ్వుకుంటూ దులిపేసుకుపోతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ అధికార పక్షంలో ఉన్నారు. మెడలు వంచే సీన్ ఎలాగూ లేదు, కనీసం సాగిలపడకపోతే అదే చాలు అనుకునే పరిస్థితి. ఇక ప్రతిపక్షం తీరు మరీ దారుణం. బీజేపీ ప్రాపకం కోసం చంద్రబాబు ఏ స్థాయికైనా దిగజారిపోతానంటూ సిగ్నల్స్ ఇస్తున్నారు. అడక్కపోయినా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో `మా మద్దతు మీకే`నంటూ చంకలు గుద్దుకుంటూ వెళ్లిపోయారు. ఇక జనసేన సంగతి సరేసరి. మీరు రోడ్ మ్యాప్ ఇస్తే ఏదైనా చేసేస్తానంటూ పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. బీజేపీ పట్టించుకోకపోయినా, వారి పని వారు చేసుకుంటున్నా కూడా మా స్నేహం ఇంకా బలంగానే ఉందని చెప్పుకుంటారు పవన్.

ఏపీలో రాజకీయ పార్టీలు బీజేపీని విమర్శిస్తాయని, ఎమ్మెల్యేలకు ఎరవేస్తున్నారంటూ ఎండగడతాయని, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారంటూ మండిపడతాయని అనుకోవడం అత్యాసే. కనీసం పక్క రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ వికృత క్రీడపై కూడా స్పందించలేని అచేతన స్థితిలో అన్ని పార్టీలు ఉండటం మాత్రం దారుణం. ఆనాడు టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ కలిపేసుకున్నా పల్లెత్తుమాట అనలేని దుస్థితి చంద్రబాబుది. రేపు ఏపీలో ఎమ్మెల్యేలను బీజేపీ బేరమాడి కొన్నా కూడా పార్టీలన్నీ కిక్కురుమనకుండా ఉంటాయనడానికి ఇదే పెద్ద సాక్ష్యం.

Tags:    
Advertisement

Similar News