ఎన్నికల విధులకు టీచర్లు దూరం.. జగన్ వ్యూహం ఏంటి..?

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ సవరణ చేస్తున్నట్టు పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం రూల్స్ సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Update:2022-11-29 21:36 IST
ఎన్నికల విధులకు టీచర్లు దూరం.. జగన్ వ్యూహం ఏంటి..?
  • whatsapp icon

ఏపీలో ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉపాధ్యాయుల విధులలో కీలక సవరణలు చేసింది. ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించకూడదనే డిమాండ్ చాన్నాళ్లుగా వినిపిస్తున్నా.. ఇన్నాళ్లకు దీనిపై ముందడుగు పడింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వర్చువల్‌ గా జరిగిన ఈ సమావేశంలో మంత్రులు సంతకాలు చేశారు. దీంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.

వాస్తవానికి తమని ఎన్నికల విధులకు దూరం చేయండి అంటూ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వినతులేమీ ఇవ్వలేదు. టాయిలెట్ల ఫొటోలు తీయండి, మధ్యాహ్న భోజనానికి కోడిగుడ్ల రవాణా మీరే చూడండి, విద్యాదీవెన వస్తువుల్ని ఎంఈఓ ఆఫీసులనుంచి మీరే తెచ్చుకోండి అంటూ ఈమధ్య ప్రభుత్వం కొత్త విధులు అప్పగించడంతో ఉపాధ్యాయులు కాస్త కలవరపడ్డారు. తమకు ఇలాంటి పనులు అప్పజెప్పొద్దంటూ ఆందోళనకు దిగారు. కానీ ఆ తర్వాత సర్దుకుపోయారు. అయితే ఇప్పుడు వాటన్నిటినీ పక్కనపెట్టి ఉపాధ్యాయులను ఎన్నికల విధులనుంచి తప్పించింది రాష్ట్ర ప్రభుత్వం.

జగన్ వ్యూహం ఏంటి..?

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఈ సవరణ చేస్తున్నట్టు పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం రూల్స్ సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల అకడమిక్ అచీవ్ మెంట్ లెవల్ పెంచేందుకు మార్పులు చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ పెద్దలు తెలిపారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించి ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉపాధ్యాయులకు ఆ విధులు అప్పగించేలా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇక్కడ జగన్ వ్యూహం పక్కాగా ఉందని ప్రతిపక్షం విమర్శలు మొదలు పెట్టింది. ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో భాగం చేస్తున్నారు. ఈమధ్య జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో కూడా సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. అయితే వారిలో చాలామంది ప్రభుత్వంపై కృతజ్ఞతతో పనిచేశారని ప్రతిపక్షం ఆరోపించింది. ఈ ఆరోపణల కారణంగానే ఇటీవల వాలంటీర్లను పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియకు దూరం పెట్టింది ఎన్నికల సంఘం. సచివాలయ ఉద్యోగులను మాత్రం మినహాయించారు. ఇప్పుడు పూర్తిగా సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో నియమించే ఆలోచన చేస్తున్నారని, అందుకే ఉపాధ్యాయులను ఆ విధులనుంచి తప్పించారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతానికి ఉపాధ్యాయ సంఘాలు ఈ నిర్ణయంపై ఇంకా స్పందించలేదు.

Tags:    
Advertisement

Similar News