ఎలక్ట్రిక్ వాహనాలు మాకొద్దు బాబోయ్.. ఏపీ ఉద్యోగుల విముఖత
నెల్లూరు జిల్లాలో 50వేలమంది ఉద్యోగులు ఉండగా కేవలం 14 దరఖాస్తులు మాత్రమే అందాయి. అందులో ముగ్గురికి వాహనాలు అందించేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి.
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలను సులభ వాయిదాల్లో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిబేటుపై వాహనాలను అందిస్తూ, అతి తక్కువ ఈఎంఐలు కడితే చాలు అంటూ దరఖాస్తులు ఆహ్వానిస్తోంద. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని నేరుగా ఆయా కంపెనీలనుంచే ఉద్యోగులకు వాహనాలు ఇప్పించాలనే ప్రయత్నం మొదలు పెట్టింది. నవంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నా ఇప్పటి వరకు స్పందన అంతంతమాత్రమే. కనీసం 0.1 శాతం మంది ఉద్యోగులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలకోసం దరఖాస్తు చేసుకోలేదు.
నెల్లూరు జిల్లాలో 50వేలమంది ఉద్యోగులు ఉండగా కేవలం 14 దరఖాస్తులు మాత్రమే అందాయి. అందులో ముగ్గురికి వాహనాలు అందించేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. నెలరోజుల టైమ్ లో కేవలం 14 దరఖాస్తులు అంటే చాలా తక్కువ అని పెదవి విరుస్తున్నారు అధికారులు. ఈ పథకంపై మరింతగా ప్రచారం చేయాలని, ఉద్యోగులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తామంటున్నారు.
ఎందుకిలా..?
వాహనాలను మార్కెట్ కంటే తక్కువధరకు, అందులోనూ ఈఎంఐ పద్ధతిలో ఇస్తామంటే ఎవరు మాత్రం ఎందుకు కాదంటారు. కానీ ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకంపై పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల వరుస ప్రమాదాలతో డిమాండ్ భారీగా పడిపోయింది. ఈ దశలో సహజంగానే వాటి సేల్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఉద్యోగులకు ఆఫర్లు ఇస్తున్నా కూడా వారు ముందుకు రావడంలేదు. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం విజయవంతం కాలేదని తేలిపోయింది. వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు, పెట్రోల్ రేట్ల భారాన్ని తగ్గించేందుకు అంటూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ ఆదరణకు నోచుకోలేదు.