ఏపీలో దిశ యాప్ రచ్చ.. నలుగురు పోలీసులపై చర్యలు

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చగా మారడంతో వెంటనే అనకాపల్లి జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. పరవాడ సంతలో ఆర్మీ ఉద్యోగి ఘటనకు సంబంధించి నలుగురు పోలీసులను ఆర్మ్డ్ రిజర్వ్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ.

Advertisement
Update:2023-11-08 09:33 IST

ఏపీలో దిశ యాప్ రచ్చ.. నలుగురు పోలీసులపై చర్యలు

ఏపీలో దిశ చట్టంతో మహిళలకు జగన్ ప్రభుత్వం అండగా నిలబడింది అని ఇంతవరకు వైసీపీ నేతలు చెప్పుకునేవారు. అసలు దిశ అనేది చట్టం కాలేదు బాబోయ్ అని టీడీపీ రాద్ధాంతం చేసే సరికి ఇప్పుడు దిశ యాప్ అనేది హైలైట్ గా మారింది. ప్రజల రక్షణకోసం ప్రభుత్వం పడే తాపత్రయాన్ని ఎవరూ కాదనలేరు కానీ అదే సమయంలో యాప్ లతో సామాన్య ప్రజల్ని సతాయిస్తుంటే మాత్రం అది ఆలోచించాల్సిన విషయమే. ప్రస్తుతం ఏపీలో ఇదే జరుగుతోంది. పోలీసులకు దిశ యాప్ టార్గెట్లు ఇచ్చారు ఉన్నతాధికారులు. దాంతో వారు కనపడినవారి ఫోన్లన్నీ తీసుకుని అందులో దిశ యాప్ డౌన్లోడ్ చేసి ఇస్తున్నారు. ఇలా అనకాపల్లి జిల్లా పరవాడ సంతలో ఓ ఆర్మీ ఉద్యోగి ఫోన్లో కూడా పోలీసులు దిశ యాప్ డౌన్ లోడ్ చేశారు. అక్కడ జరిగిన గొడవ చివరకు ఆ నలుగురు పోలీసుపై క్రమశిక్షణ చర్యలకు కారణమైంది.

అసలేం జరిగింది..?

అనకాపల్లి జిల్లా పరవాడ సంతకు రేగుపాలేనికి చెందిన సైనికుడు సయ్యద్ అలీముల్లా వచ్చారు. అదే సంతకు నలుగురు పోలీసులు కూడా వచ్చారు. వారు దిశ యాప్ ని అందరి ఫోన్లలో డౌన్ లోడ్ చేయిస్తున్నారు. దిశ యాప్ పై సరైన అవగాహన లేని ఆర్మీ ఉద్యోగి అలీముల్లా ఫోన్ కూడా తీసుకుని యాప్ డౌన్ లోడ్ చేశారు. ఆ తర్వాత ఓటీపీ వస్తుంది చెప్పాలన్నారు. అక్కడే ఆర్మీ ఉద్యోగికి అనుమానం వచ్చింది. ఓటీపీ నేనెందుకు చెబుతాను, అసలు మీరెవరు, మీ ఐడీకార్డులు చూపించండి అన్నారు. దీంతో పోలీసులకు కోపం వచ్చింది. యూనిఫామ్ లో ఉన్న తమనే ఐడీకార్డులు చూపించమంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మీ ఉద్యోగి కూడా తగ్గేది లేదన్నారు. ఒకరితో ఒకరు కలబడటంతో ఆ వ్యవహారమంతా సోషల్ మీడియాకెక్కింది. దీన్ని టీడీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంది.

అసలే దిశ చట్టంపై తీవ్ర విమర్శలున్నాయి. చట్టం కాకపోయినా ఏపీ ప్రభుత్వం దిశ యాప్ అంటూ హడావిడి చేస్తోందని టీడీపీ ఆరోపణలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకునే క్రమంలో ఓ ఆర్మీ ఉద్యోగిపై ఏపీ పోలీసులు దౌర్జన్యానికి దిగారంటూ నారా లోకేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసులు గూండాల్లా దాడి చేశారంటూ మండిపడ్డారు.

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చగా మారడంతో వెంటనే అనకాపల్లి జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. పరవాడ సంతలో ఆర్మీ ఉద్యోగి ఘటనకు సంబంధించి నలుగురు పోలీసులను ఆర్మ్డ్ రిజర్వ్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 

Tags:    
Advertisement

Similar News