ఇంధన పొదుపులో ఏపీకి జాతీయ అవార్డు
రాష్ట్రం తరఫున ఇంధన సామర్థ్యం, పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏపీఎస్ఈసీఎంకు ఇది ఐదో జాతీయ పురస్కారం కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఇంధన పొదుపులో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకమైన `జాతీయ ఇంధన పరిరక్షణ` అవార్డును సొంతం చేసుకుంది. రాష్ట్రం తరఫున ఇంధన సామర్థ్యం, పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏపీఎస్ఈసీఎంకు ఇది ఐదో జాతీయ పురస్కారం కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
2020తో పోల్చితే.. 53 శాతం మెరుగై...
ఇంధన వినియోగం ఆధారంగా దేశంలోని రాష్ట్రాలను నాలుగు గ్రూపులుగా విభజించగా, అందులో రెండో గ్రూపులో ఉన్న ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. తద్వారా మొదటి స్థానంలో నిలిచి ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఏపీఎస్ఈసీఎం స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్ - 2022లో 77.5 స్కోరు సాధించింది. 2020లో రాష్ట్రానికి 50.5 స్కోరు రాగా.. అది తాజాగా 53 శాతం మెరుగవడం విశేషం.
అవార్డుకు కారణాలివీ...
రాష్ట్రంలో ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్-2017 జీవో జారీ, పట్టణ, స్థానిక సంస్థల్లో భవన నిర్మాణ రంగంలో చేసిన సవరణలు, భవన నిర్మాణ రంగంలో ఎకో-నివాస్ సంహిత అమలుకు తీసుకున్న చర్యలు, కోర్టు భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలు వంటివి రాష్ట్రానికి అవార్డు రావడానికి దోహదపడ్డాయి. అలాగే ఎంఎస్ఎంఈలో అమలు చేసిన ఇంధన సామర్థ్య కార్యక్రమాలు, ఆర్టీసీ సహా వివిధ ప్రభుత్వ శాఖలకు ఎలక్ట్రిక్ వాహనాల అందజేత, సాధారణ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు తీసుకున్న చర్యలు, పరిశ్రమలు, వ్యవసాయం, గ్రామీణ మంచినీటి సరఫరా, పాఠశాలలు, పంచాయతీలు, మునిసిపాలిటీలు తదితర శాఖల్లో చేపట్టిన వివిధ ఇంధన సామర్థ్య కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ఏపీ స్కోరు మెరుగుపడేందుకు దోహదపడ్డాయి.
ప్రభుత్వ చర్యలతో రూ.3,800 కోట్ల విలువైన విద్యుత్ ఆదా...
కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే.. అవార్డు సాధించిన నేపథ్యంలో ఏపీఎస్ఈసీఎంకు అభినందనలు తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందించిన సహకారం, మార్గదర్శకాల కారణంగానే రాష్ట్రానికి ఈ అవార్డు లభించిందని ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ వెల్లడించారు. ప్రభుత్వ సహకారంతో వివిధ కీలక రంగాల్లో అమలు చేసిన ఇంధన సామర్థ్య కార్యక్రమాల వల్ల రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేయగలిగినట్టు చెప్పారు.