అన్న క్యాంటీన్ లో చికెన్, కోడిగుడ్డు, స్వీటు..

హిందూపురంలో బాలకృష్ణ దంపతులు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆ క్యాంటీన్ ఏర్పాటు చేసి 200 రోజులు పూర్తయిన సందర్భంగా చికెన్ తో విందు భోజనం పెట్టారు.

Advertisement
Update:2022-12-14 05:51 IST

రెండు రూపాయలకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లో తాజాగా ఆ భోజనంతోపాటు స్వీటు, కోడిగుడ్డు కూడా ఇచ్చారు. అంతే కాదు కోడి కూర కూడా పెట్టారు. హిందూపురంలో బాలకృష్ణ ఏర్పాటు చేసిన మొబైల్ అన్న క్యాంటీన్ వద్ద రెండు రూపాయలకే మాంసాహార భోజనాన్ని అందించారు టీడీపీ నాయకులు. అయితే ఇది ఒక్కరోజు మాత్రమే. హిందూపురంలో బాలకృష్ణ అన్న క్యాంటీన్ ప్రారంభించి 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఇలా బిర్యానీ పెట్టి హడావిడి చేశారు టీడీపీ నేతలు.

ఆమధ్య ఏపీలో చాలా చోట్ల అన్న క్యాంటీన్లను ప్రారంభించారు టీడీపీ నేతలు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా, తాము పేదల ఆకలి తీరుస్తున్నామంటూ మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల అన్న క్యాంటీన్ల కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలను అధికారులు తొలగించడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వం పెట్టదు, మమ్మల్ని పెట్టనివ్వదు అంటూ అప్పట్లో పెద్ద రచ్చ చేశారు నాయకులు. ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగించడం తప్పా అని అధికారులు బదులిచ్చారు. ఈ గొడవంతా ఎందుకని.. ఆస్పత్రులు, ఇతరత్రా కొన్ని ప్రాంతాల్లో మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చాలా చోట్ల వాటిని స్వచ్ఛందంగా తొలగించారు కూడా. అయితే హిందూపురంలో బాలకృష్ణ దంపతులు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ని మాత్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఆ క్యాంటీన్ ఏర్పాటు చేసి 200 రోజులు పూర్తయిన సందర్భంగా చికెన్ తో విందు భోజనం పెట్టారు.

అప్పట్లో అన్న క్యాంటీన్లకోసం ప్రత్యేక నిర్మాణాలను కూడా చేపట్టింది టీడీపీ ప్రభుత్వం. వైసీపీ వచ్చాక వాటిని మూసేసింది. ఆ తర్వాత మున్సిపాల్టీల పరిధిలో ఉన్న ఆ క్యాంటీన్లన్నీ వార్డు సచివాలయాలుగా మారిపోయాయి. నిర్మాణాలు ఎక్కడా వృధా కాలేదు కానీ, అసలు ఆ క్యాంటీన్లను తొలగించడమేంటనేది టీడీపీ ప్రశ్న. సంక్షేమ పథకాలతో ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతున్నప్పుడు, క్యాంటీన్ల అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.

Tags:    
Advertisement

Similar News