జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా మారుతున్న కేటీఆర్
కల్వకుంట్ల తారక రామారావు.. మీడియా, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ కేటీఆర్‌గా పిలిచే నాయకుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తండ్రి వెనుక అడుగులు వేస్తూ వచ్చిన కేటీఆర్.. ఇవ్వాళ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తెలంగాణ మంత్రిగా రెండు పాత్రలనూ సమర్థవంతంగా పోషిస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా యువతలో కేటీఆర్‌కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఏ సినిమా హీరోకు కూడా తగ్గకుండా […]
కల్వకుంట్ల తారక రామారావు.. మీడియా, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ కేటీఆర్‌గా పిలిచే నాయకుడు. తెలంగాణ ఉద్యమ సమయంలో తండ్రి వెనుక అడుగులు వేస్తూ వచ్చిన కేటీఆర్.. ఇవ్వాళ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, తెలంగాణ మంత్రిగా రెండు పాత్రలనూ సమర్థవంతంగా పోషిస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా యువతలో కేటీఆర్‌కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ ఏ సినిమా హీరోకు కూడా తగ్గకుండా ఉంటాయి.
ఇప్పటికే రాష్ట్రంలో తన రాజకీయ, పరిపాలనా సామర్థ్యాలను నిరూపించుకున్న కేటీఆర్.. ఇక టీఆర్ఎస్ తరఫున జాతీయ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసే కార్యాక్రమానికి టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ పాల్గొన్నారు.
తన రాజకీయ జీవితంలో జాతీయ స్థాయిలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతి పెద్ద కార్యక్రమం ఇదే. దేశంలోని 16 విపక్ష పార్టీల సినీయర్ నాయకులతో కేటీఆర్ కూడా ఉండటం విశేషం. జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్న సమయంలో.. ఆయన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమైన సమావేశానికి పంపించారు. అంటే, జాతీయ స్థాయిలో కూడా పార్టీకి కేటీఆర్ ముఖం కాబోతున్నట్లుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రెండు నెలల క్రితం జరిగిన ప్లీనరీలో కేసీఆర్ స్వయంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకతను వెల్లడించారు. కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాలని ఆయన కోరుకున్నారు. దేశానికి కొత్త రాజకీయ ఫ్రంట్లు కాదు, ప్రత్యామ్నాయ అజెండా కావాలని సూచించారు.
టీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై కేసీఆర్‌కు ఇప్పటికే స్పష్టమైన అవగాహన ఉంది. ఫెడరల్ స్పూర్తిని దెబ్బతీస్తూ కేంద్రం దిగుతున్న చర్యలను ఆయన ఎన్నోసార్లు ఎండగట్టారు. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు, విద్యుత్ రంగంలో కష్టాలను ఆయన వివరించారు. ఈ క్రమంలో ఆయన తన కుమారుడు కేటీఆర్‌నే జాతీయ స్థాయిలో కీలకంగా మార్చబోతున్నారనే సంకేతాలు రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం ద్వారా పంపారని భావిస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ కూడా ఏ మాత్రం తడబడకుండా పార్టీ స్టాండ్‌ను సరిగ్గా వివరించారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రాజకీయాలను వ్యతిరేకిస్తుందని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి యశ్వంత్ సిన్హాకు తాము మద్దతు ఇస్తున్నామని.. శరద్ పవార్, మమత బెనర్జీ వంటి నాయకులు తమతో మాట్లాడిన తర్వాత మాకు స్పష్టత వచ్చిందని కేటీఆర్ వివరించారు.
ఆ తర్వాత కేటీఆర్ అనేక మంది ఇతర పార్టీ సీనియర్ నాయకులను కలిశారు. రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్, ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్ వంటి వాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. కేటీఆర్ ఇంత మంది నాయకులను ఒకేసారి కలవడం, అదీ ఢిల్లీలో ఇదే తొలిసారి కావడం విశేషం.
కేసీఆర్ లాగానే కేటీఆర్ కూడా ఎప్పటికప్పుడు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. కేసీఆర్ ఎక్కువగా బహిరంగ సభలు, మీడియా మీట్లలో మోడీ, బీజేపీని ఎండగడుతుంటారు. కానీ, కేటీఆర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా నిత్యం విమర్శలు గుప్పిస్తుంటారు. ఇటీవల యువత ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగిస్తుండటంతో కేటీఆర్ విమర్శలు చాలా త్వరగా ఒక వర్గానికి చేరిపోతున్నాయి.
ఇంగ్లిష్ బదులుగా హిందీని వాడాలని ఇటీవల హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. దీనిపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది కచ్చితంగా భాషోన్మాదం, ఆధిపత్య ధోరణి కిందకే వస్తుందని.. అంతర్జాతీయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతను ఇంగ్లిష్ మాట్లాడొద్దని చెప్పడం దారుణమని విమర్శించారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఢిల్లీ వేదికగా ఆయన విమర్శలు చేయడంతో జాతీయ మీడియా కూడా కవర్ చేసింది. బీజేపీ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ, ఐఐటీ, ఐఐఎం కూడా ఇవ్వలేదని.. విభజన హామీలు కూడా నెరవేర్చలేదని కేటీఆర్ అన్నారు.
మరోవైపు కేటీఆర్ ఒక సక్సెస్‌ఫుల్ మంత్రి అని చెప్పవచ్చు. టీఆర్ఎస్ ఏర్పడిన ఎనిమిదేళ్ల తర్వాత ఆ పార్టీ తరఫున పోటీ చేసినా.. అప్పటి నుంచి సిరిసిల్లలో గెలుస్తూనే ఉన్నారు. తాను చదివించి ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఎంబీఏనే అయినా.. ఐటీ సెక్టార్‌ను ముందుకు తీసుకెళ్లడంతో తనదైన ముద్రవేశారు. ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు.
కేటీఆర్ హయాంలోనే హైదరాబాద్‌లో ఐటీ సెక్టార్ రాకెట్ వేగంతో అభివృద్ది చెందిందంటే అతిశయోక్తికాదు. ఏడేళ్ల క్రితం ఆయన ఆలోచనలోంచి పుట్టిన టీ-హబ్.. ఇవాళ రెండో దశ కూడా ప్రారంభించుకుంది. ఆయన మంత్రిగా చేసిన ఎన్నో పాలసీల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని సెకండ్ టైర్ సిటీస్ అయిన వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో కూడా ఐటీ కంపెనీలు ప్రారంభమవడానికి ఉపయోగపడ్డాయి. ఇలా ఇటు రాష్ట్రంలో రాజకీయాలు, పాలనలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూనే.. ఇక ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టడానికి ముందుకు సాగుతున్నారు.