ఆ ఎల్ఈడీ బోర్డు తీయక‌పోతే.. మోడీ ఫొటోకు దండేసి రాష్ట్రమంతా ఫ్లెక్సీలు కడతాం : టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నడుమ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ సారి రాష్ట్రంలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. తమకు తెలిసిన ఫేక్ న్యూస్ ప్రచారాన్ని కొనసాగిస్తూనే.. సీఎం కేసీఆర్‌పై కూడా విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రంలో అధికారం నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీని దింపేస్తామంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక ఎల్ఈడీ […]

Advertisement
Update:2022-06-27 06:01 IST

తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీ నడుమ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ సారి రాష్ట్రంలో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్న బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. తమకు తెలిసిన ఫేక్ న్యూస్ ప్రచారాన్ని కొనసాగిస్తూనే.. సీఎం కేసీఆర్‌పై కూడా విమర్శలు గుప్పిస్తోంది.

రాష్ట్రంలో అధికారం నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీని దింపేస్తామంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో బీజేపీ స్టేట్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక ఎల్ఈడీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య మరోసారి చిచ్చు పెట్టింది.

నాంపల్లిలోని హెడ్ క్వార్టర్ వద్ద ‘సాలు దొర.. సెలవు దొర’ అని రాసి.. కేసీఆర్ ఫొటో పెట్టారు. అంతే కాకుండా కల్వకుంట్ల కౌంట్‌డౌన్ పేరుతో పక్కన.. ఇన్ని రోజుల్లో దిగిపోబోతున్నారు అంటూ రోజులు, గంటలు, సెకెన్లతో సహా కౌంట్ డౌన్ నడిపిస్తున్నారు. దీనిపై టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.

బీజేపీ పార్టీ ఆఫీసు వద్ద సీఎం కేసీఆర్‌ను అవమానపరుస్తూ పెట్టిన ఎల్ఈడీ బోర్డును వెంటనే తీసేయాలని.. లేకపోతే పీఎం మోడీ ఫొటోకు చెప్పుల దండ వేసిన ఫ్లెక్సీలు రాష్ట్ర మంతటా పెడతామని పార్టీ హెచ్చరించింది. పార్టీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కేపీ వివేకానంద, ముఠా గోపాల్, ఎం ఆనంద్, నోముల భగత్, ఎమ్మెల్సీ దండె విఠల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ పార్టీని హెచ్చరించారు.

అసలు ఈ కౌంట్ డౌన్ బీజేపీ పార్టీ తమ కోసమే పెట్టుకుంది. రాష్ట్రం, కేంద్రం నుంచి ఆ పార్టీ కనుమరుగు అయ్యే సమయాన్ని వాళ్లే పెట్టుకున్నారు అని వాళ్లు ఎద్దేవా చేశారు. ఇప్పటికే దేశంలోని యువత ‘మోడీ హటావో దేశ్ బచావో’ అనే నినాదాన్ని తలకెత్తుకున్నారని వారు గుర్తుచేశారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్ తన సొంత రాష్ట్రమైన పంజాబ్‌లో ఓడిపోయాడు. సొంత మనుషులే ఆయనను తరిమికొడితే.. తెలంగాణకు వచ్చి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు.

పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ పెద్దలు ముందు తెలంగాణకు వచ్చి.. ఈ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని, గత 8 ఏళ్లలో వాళ్లు రాష్ట్రానికి చేసిన అభివృద్దిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన‌ వాటిని కూడా ఇవ్వలేదని, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం సమయం తీసుకుంటారని వారు ప్రశ్నించారు. కరీంనగర్ నియోజకవర్గానికి బండి సంజయ్ ఏం చేశాడో అక్కడి ప్రజలకు చెప్పాలని వాళ్లు డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News