రేవంత్‌ అనాలోచిత నిర్ణయాలతోనే రైతుల ఆత్మహత్యలు

అవన్నీ ప్రభుత్వ హత్యలే.. 24 నుంచి కమిటీ రాష్ట్ర పర్యటన : కేటీఆర్‌

Advertisement
Update:2025-01-22 18:01 IST

సీఎం రేవంత్‌ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అన్నారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని తెలిపారు. బుధవారం మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి నివాసంలో రైతు ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, రేవంత్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. రైతు ఆత్మహత్యలపై కమిటీ వేయడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్నారు. రైతులకు అండగా నిలబడాలన్న ఆలోచన తప్ప ఇంకేం లేదన్నారు. ఆదిలాబాద్ బ్యాంకులో రైతు ఆత్మహత్య చేసుకోవడంతోనే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలతో ఈ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ ఈనెల 24 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి అధ్యయనం ప్రారంభిస్తుందని తెలిపారు. రానున్న నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులను కలిసి వారికి ఎంత రుణమాఫీ జరిగింది.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కరెంట్‌ సరఫరా ఎలా ఉంది.. వ్యవసాయకు సానుకూల పరిస్థితులు ఉన్నాయా లేవా.. పండించిన పంటలకు మద్దతు ధర లభిస్తుందా.. కొనుగోలు కేంద్రాల్లో పంట కొనుగోలు చేస్తున్నారా.. రైతు వేదికలు పని చేస్తున్నాయా అనే అంశాలపై అధ్యయనం చేయనున్నారు.




 

వరంగల్‌ డిక్లరేషన్‌ పేరుతో రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకపోవడంతోనే రైతాంగం నిరాశలో కూరుకుపోయిందని అన్నారు. రైతుల పట్ల కేసీఆర్‌ కు ఉన్న ప్రేమ, ఆర్తి ప్రస్తుత పాలకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. రైతుబంధు, రుణమాఫీ పేరుతో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా రూ.లక్ష కోట్లు జమ చేసిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రైతుల్లో ఆత్మ విశ్వాసం పెంచేందుకు కేసీఆర్‌ ప్రయత్నించారని, దీంతోనే రైతులు ధీమాగా వ్యవసాయం చేసుకున్నారని తెలిపారు. రైతుబంధు, బీమా, 24 గంటల ఉచిత కరెంట్‌, భూమి శిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయడంతోనే రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని అన్నారు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ అది నిజమనే అపోహను ప్రజల్లో కలిగిస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లలో 6.47 లక్షల కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చిందన్నారు. మీ సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులిచ్చామని.. ఇప్పటి ప్రభుత్వం మాదిరిగా పబ్లిసిటీ పిచ్చితో తాము ప్రచారం చేసుకోలేదన్నారు. రాష్ట్రంలో హోం మంత్రి లేరని.. లా అండ్‌ ఆర్డర్‌ గాడి తప్పిందన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం, సోషల్‌ మీడియాలో పోస్టులకు భయపడి అరెస్టులు చేయడం రేవంత్‌ రెడ్డికే చెల్లిందన్నారు. ఈ సీఎం ప్రాధాన్యత ఫార్ములా కేసు అయితే తమ ప్రాధాన్యం ఫార్మర్‌ అన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే నల్గొండలో రైతు ధర్నా నిర్వహిస్తామన్నారు.

ఆందోళన వద్దు భవిష్యత్‌ మనదే

బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్‌ బీఆర్‌ఎస్‌ దేనని కేటీఆర్‌ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో సత్తుపల్లి మున్సిపల్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు ఎంతగా విసిగిపోయి ఉన్నారో నిన్నటి గ్రామ సభలతోనే తేలిపోయిందన్నారు. కోపంతో ప్రజలు టెంట్లు పీకేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు చేసిన పనులు గతంలో ఎప్పుడూ చేయలేదని.. ఇప్పుడూ జగరడం లేదన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే బీఆర్‌ఎస్‌ విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు గెలిస్తే వారిలో 17 మంది ఇంకా పార్టీలో కొనసాగడం వారికి పార్టీ పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. త్వరలోనే సత్తుపల్లి నేతలతో కేసీఆర్‌ సమావేశమవుతారని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News