ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్‌ అభివృద్ధి

తెలంగాణలో డ్రైపోర్టును ఏపీలోని మచిలీపట్నం పోర్టుతో అనుసంధానిస్తామన్న సీఎం రేవంత్‌

Advertisement
Update:2025-01-22 21:52 IST

 రవాణా రంగంలో పెట్టుబడులకు ముందుకు రావాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక ఫోరం, సీఐఐ హీరో మోటార్ కార్ప్‌ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ప్రపంచస్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసి రావాలన్నారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడానికి సహకరించాలని పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజలు తక్కువ ఖర్చుతో.. వేగంగా ప్రయాణించాలనేది ప్రభుత్వ ఆకాంక్ష అని సీఎం వివరించారు. అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూరుస్తుందని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌ ఫ్యూచర్‌ సిటీలో ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. విద్యుత్‌ వాహనాలపై రోడ్‌ ట్యాక్స్‌, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు రద్దు చేసినట్లు వివరించారు.

దేశంలో అత్యధిక ఈవీ వాహనాల విక్రయాలు తెలంగాణలోనే జరుగుతున్నాయన్నారు. మొబిలిటీతో పాటు.. పర్యావరణ అనుకూల వ్యవస్థలు అవసరమని, అందుకే జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో డ్రైపోర్టును నిర్మించి వేర్‌హౌజ్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రానికి తీర ప్రాంతంలేని లోటును పూడ్చడానికి డ్రైపోర్టుకు సమీపంగా ఉండే ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు ప్రత్యేకంగా రోడ్డు, రైలు మార్గాలతో అనుసంధానం చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. నగరాల అభివృద్ధికి, భవిష్యత్తుకు అర్బన్‌ మొబిలిటీ పునాది వంటిదన్నారు. తక్కువ ఖర్చు, వేగంగా చేరుకునే రవాణా సదుపాయాలున్న నగరాలే ఎక్కువ కాలం మనగలుగుతాయని సీఎం అన్నారు. కోటీ 20 లక్షలకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో సుమారు 100 కిలోమీటర్లకు పైగా కొత్తగా మెట్రో లైన్లను నిర్మిస్తున్నట్లు వివరించారు.

Tags:    
Advertisement

Similar News