బీఆర్‌ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి
ఈనెల 28న నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ధర్నా
బీఆర్‌ఎస్ నల్గొండ జిల్లా కేంద్రంలో తలపెట్టిన రైతు ధర్నాకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 28న నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రైతు ధర్నా చేసుకోవచ్చని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో బీఆర్‌ఎస్ రైతు ధర్నాకు పిలుపునిచ్చింది. సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లి వస్తున్న ప్రజలతో హైవే రద్దీగా ఉండటం, ఈనెల 21 నుంచి 24వరకు గ్రామ సభలు ఉండటంతో రైతు ధర్నాకు అనుమతి ఇవ్వబోమని పోలీసులు తేల్చిచెప్పారు. పోలీసుల నిర్ణయంపై బీఆర్‌ఎస్ లీగల్ సెల్ హైకోర్టును ఆశ్రయించగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 21వ తేదీకి బదులుగా 28న ధర్నా చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా ధర్నా చేయాలని న్యాయమూర్తి తన ఆదేశాల్లో సూచించారు.