గాంధీ భవన్‌లో తన్నుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు
అర్హతలు లేకున్నా పదవులు ఎలా ఇస్తారని ఆగ్రహం
గాంధీ భవన్‌లో యూత్ కాంగ్రెస్ నాయకులు కొట్టుకున్నారు. ఒక నాయకుడిని గాంధీ, ఇందిరా భవన్ ల ఆవరణలో ఉరికిచ్చి (తరిమి) మరి కొట్టారు. నాయకుల దాడిలో సదరు యూత్ కాంగ్రెస్ నాయకుడి చొక్కా చిరిగిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి నుంచి యూత్ కాంగ్రెస్ జెండా మోసిన వారు, కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా పదవులు ఇస్తారని నాయకులు ప్రశ్నించారు. దీంతో రెండు వర్గాలు పరస్పరం తోసేసుకున్నాయి. ఆ తర్వాత భవన్ నుంచి బయటికి వచ్చిన నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సదరు వ్యక్తి ఇతర పార్టీ నుంచి వచ్చారని, ఆయనకు అర్హత లేకున్నా పదవి అప్పగించారని పేర్కొంటూ ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ కు లేఖ రాసినా ఆయనకే ఎలా పదవి కట్టబెడుతారని రాష్ట్ర నాయకులను నిలదీశారు. నాయకుల పరస్పర దాడులతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.