12 కోట్ల విధ్వంసానికి 35 వేలతో ప్లానింగ్

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అగ్నిపథ్ అల్లర్ల కారణంగా జరిగిన ఆస్తి నష్టం అక్షరాలా 12కోట్ల రూపాయలు. రైల్వే బోగీలు తగలబెట్టడం, ఇతరత్రా ఆస్తుల ధ్వంసం కారణంగా రైల్వేకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనికి కారణం.. అగ్నిపథ్ పథకం అమలులోకి వస్తే.. డిఫెన్స్ కోచింగ్ అకాడమీలకు ప్రాధాన్యం ఉండబోదనే ఒకే ఒక్క కారణం. ఆ కారణంతోనే సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు ఈ పని చేయించాడు. తన అనుచరులు మల్లారెడ్డి, బీసీ రెడ్డి, శివతో కలిపి […]

Advertisement
Update:2022-06-25 11:36 IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అగ్నిపథ్ అల్లర్ల కారణంగా జరిగిన ఆస్తి నష్టం అక్షరాలా 12కోట్ల రూపాయలు. రైల్వే బోగీలు తగలబెట్టడం, ఇతరత్రా ఆస్తుల ధ్వంసం కారణంగా రైల్వేకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీనికి కారణం.. అగ్నిపథ్ పథకం అమలులోకి వస్తే.. డిఫెన్స్ కోచింగ్ అకాడమీలకు ప్రాధాన్యం ఉండబోదనే ఒకే ఒక్క కారణం.

ఆ కారణంతోనే సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు ఈ పని చేయించాడు. తన అనుచరులు మల్లారెడ్డి, బీసీ రెడ్డి, శివతో కలిపి పక్కా ప్లాన్ తో సికింద్రాబాద్ అల్లర్లకు కారణం అయ్యాడు. ఈ అల్లర్లకోసం సుబ్బారావు పెట్టిన ఖర్చెంతో తెలుసా..? 35వేల రూపాయలు.

తన ఇనిస్టిట్యూట్ కి క్రేజ్ తగ్గిపోతుందేమోనన్న భయంతో డబ్బులు ఖర్చుపెట్టి మరీ సుబ్బారావు విధ్వంస రచన చేసినట్టు తేల్చారు రైల్వే పోలీసులు. అతనితోపాటు అతని అనుచరులపై కూడా రైల్వే యాక్ట్ తోపాటు మరో 25 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి రైల్వే కోర్టులో హాజరుపరిచారు. రైల్వే కోర్ట్ ఆ నలుగురికి రెండు వారాల రిమాండ్ విధించింది. వారిని చంచల్ గూడ జైలుకి తరలించారు.

లాడ్జిలో కూర్చుని పక్కా ప్లానింగ్..
సికింద్రాబాద్ అల్లర్లకు ముందురోజు సుబ్బారావు నరసరావుపేట నుంచి బోడుప్పల్‌కి వచ్చాడు. ఓ లాడ్జిలో బసచేశాడు. తన అనుచరులకు ప్లాన్ అందించాడు. కోచింగ్ సెంటర్లో ఉన్న యువతను రెచ్చగొట్టి సికింద్రాబాద్ కి రప్పించాడు, ఆందోళనలు చేసే విధంగా ప్రేరేపించాడు. 35వేల రూపాయలు ఇచ్చి పెట్రోలు, ఇతర సామగ్రి కొనిపెట్టాడు.

ముందురోజు రాత్రి వారి బస ఏర్పాట్లన్నీ సుబ్బారావే చూసుకున్నాడు. అల్లర్ల వ్యవహారం ఎంతవరకు వచ్చింది, తన శిష్యులు ఏమేం చేశారనేది టీవీ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ ద్వారా తెలుసుకున్నాడు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూపులో పోస్టింగ్‌లు పెట్టివారిని రెచ్చగొట్టి.. చివరకు విధ్వంసం సృష్టించారు.

ఇతర రాష్ట్రాల్లో కూడా రైల్వే స్టేషన్లలో ఆందోళనలు జరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే తమ నిరసన అందరికీ తెలుస్తుందనే ఆలోచనతో రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించారు సుబ్బారావు. అయితే ఇతర రాష్ట్రాల్లో కంటే ఇక్కడ ఆందోళనలు శృతిమించాయి.

కాల్పుల్లో ఒక అమాయక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్నారు. ఫోన్ కాల్స్, వాట్సాప్‌ చాటింగ్ ఆధారంగా ప్రధాన ముద్దాయి సుబ్బారావు అని తేల్చారు. అతని అనుచరుల్ని కూడా అరెస్ట్ చేశారు. నేరుగా విధ్వంసంలో పాల్గొన్నవారిని కూడా గతంలోనే అరెస్ట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News