‘రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు ఎందుకు ఎంపిక కాలేదు?

భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ప్రకటించడంతో, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అవ‌కాశాన్ని కోల్పోయారు. ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి రావ‌చ్చ‌ని కొంత‌మంది కొన్ని స‌మీక‌ర‌ణ‌ల‌తో భావించినా న‌రేంద్ర‌మోడీ వ్య‌క్తిత్వాన్ని బాగా ఎరిగిన వారు మాత్రం వెంకయ్య నాయుడికి రాష్ట్ర‌ప‌తి అవ‌కాశం రాద‌నే అనుకున్నారు. వెంక‌య్య‌నాయుడు రాజ‌కీయంగా చాలా క్రియా శీలంగా ఉండే వ్య‌క్తి. ఉత్త‌ర ద‌క్షిణ ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల్లోనే గాక పార్టీలకు అతీతంగా […]

Advertisement
Update:2022-06-23 08:26 IST

భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ప్రకటించడంతో, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అవ‌కాశాన్ని కోల్పోయారు. ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి రావ‌చ్చ‌ని కొంత‌మంది కొన్ని స‌మీక‌ర‌ణ‌ల‌తో భావించినా న‌రేంద్ర‌మోడీ వ్య‌క్తిత్వాన్ని బాగా ఎరిగిన వారు మాత్రం వెంకయ్య నాయుడికి రాష్ట్ర‌ప‌తి అవ‌కాశం రాద‌నే అనుకున్నారు. వెంక‌య్య‌నాయుడు రాజ‌కీయంగా చాలా క్రియా శీలంగా ఉండే వ్య‌క్తి. ఉత్త‌ర ద‌క్షిణ ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల్లోనే గాక పార్టీలకు అతీతంగా స్నేహ సంబంధాలు గ‌ల‌ వ్య‌క్తి కూడా.

ద‌క్షిణ భార‌తంలో ప‌ట్టు సాధించాల‌నుకుంటున్న బిజెపి ఈ ప్రాంతానికి చెందిన వ్య‌క్తిగాను, బిజెపితో సుదీర్ఘ ప్ర‌యాణం చేసిన నిబ‌ద్ధ‌త గ‌ల నాయ‌కుడిగా ఆయ‌న‌ను రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి ఎంపిక చేస్తార‌ని అనుకున్నారు. వాజ‌పేయి, ఎల్ కె అద్వానీ వంటి సీనియ‌ర్ నాయ‌కుల‌కు త‌ల‌లో నాలుక‌లా విశ్వ‌స‌నీయ అనుచ‌రుడిగా ఉండేవారు. అయితే పార్టీలో త‌రాల మార్పుతో వ‌చ్చిన అంత‌రాలు అద్వానీ వంటి సీనియ‌ర్ నాయ‌కులను ప‌క్క‌కు గెంటేలా చేశాయి. ఈ అంత‌రాల‌ వ‌ల్లో, రాజ‌కీయంగా అడ్డు వ‌స్తార‌నే అభిప్రాయంతోనో న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా హ‌వా ప్రారంభంకాగానే సీనియ‌ర్లు నిర్ల‌క్ష్యానికి గుర‌య్యారు. క్రియాశీల రాజకీయాల్లో సుదీర్ఘ కెరీర్ తర్వాత 2017లో వెంక‌య్య‌నాయుడిని ఉపాధ్యక్షుడిగా ఎంపిక చేసిన‌ప్పుడే ఆయ‌న్నుమోడీ-షా ద్వయం ప‌క్క‌న బెట్టేశార‌నే అభిప్రాయం అటు పార్టీలోనూ, ఇత‌ర రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ వినిపించింది.

కొత్త‌త‌రం..కొత్త ఒర‌వ‌డి..
నిజానికి 2000 ద‌శ‌కంలో వెంక‌య్య‌నాయుడు కేంద్ర మంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న‌ప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న న‌రేంద్ర మోడీ జాతీయ స్థాయిలో చ‌క్రం ఏలుతార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అద్వానీ, వాజ్‌పేయిలతో కూడిన పాత‌త‌రానికి మోడీ, అమిత్ షా ల‌తోకూడిన కొత్త‌ త‌రానికి మ‌ధ్య వెంక‌య్య‌నాయుడు వార‌ధిగా ఉంటార‌ని భావించారు. అద్వానీ శిష్యుడిగా రాజ‌కీయాల్లో ఎదిగిన మోడీ ఆ త‌ర్వాత చాలా సులువుగా ఆయ‌న్ను ప‌క్క‌న‌బెట్టి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌పరుస్తూ తానేమిటో చెప్ప‌క‌నే చెప్పారు. ఇదే క్ర‌మంలో అద్వానీకి అనుంగు అనుచ‌రుడిగా పేరొందిన వెంక‌య్య నాయుడిని కూడా ‘పార్టీ నిర్ణ‌యం’ పేరుతో మోడీ అత్యంత సులువుగా క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరం చేయ‌గ‌లిగారు.

నిబ‌ద్ధ‌త గల కార్య‌క‌ర్త‌గా వెంక‌య్యనాయుడు 2017లో ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌విని అంగీక‌రించాల్సి వ‌చ్చింది. రాష్ట్రంలో వెంక‌య్య‌నాయుడు తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తున్నార‌ని, అందువ‌ల్లే బిజెపి ఎద‌గ‌లేక‌పోతోంద‌నే అప‌వాదును ఎదుర్కొన్నారు. ప్ర‌త్యేక హోదా హ‌మీ నెర‌వేర్చ‌లేద‌నే కార‌ణంగా రాష్ట్రంలో బిజెపి ఆద‌ర‌ణ పొంద‌లేక 2019 ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం పాలైంది. అయిన‌ప్ప‌టికీ ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది.

ఉత్తర-ద‌క్షిణ భేదాలు..
సామాజిక స‌మీక‌ర‌ణాల వ‌ల్ల ముర్ముకు అవ‌కాశం వ‌చ్చిన‌ట్టు కనిపిస్తున్నది. దేశ రాజ‌కీయాల్లో ఉత్త‌రాది, ద‌క్షిణాది బేధాలు పెరుగుతున్న‌స‌మ‌యంలో వెంక‌య్య‌నాయుడుని ఎంపిక చేసి ఉంటే రెండు ప్రాంతాల మ‌ధ్య మ‌రింత అవ‌గాహ‌న ఏర్ప‌డేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతేగాక ద‌క్షిణాదిలో పార్టీ పుంజుకునేందుకు దోహ‌ద‌ప‌డేది. ఇప్పటివరకు ప‌నిచేసిన 15 మంది దేశాధ్యక్షులలో ఆరుగురు మాత్రమే దక్షిణ భారతదేశీయులు. వారిలో నీలం సంజీవ రెడ్డి (1977-82), వి.వి. గిరి (1969-74) మ‌త్ర‌మే తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. రెండవ రాష్ట్రపతి (1962-67)గా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. అయినప్పటికీ, ఆయ‌న్ను తెలుగు వ్యక్తిగానే కొంద‌రు భావిస్తారు.

వెంక‌య్య‌నాయుడిని ఎంపిక చేసి ఉంటే టిఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ సిఎం కేసీఆర్, టిడిపి అధినేత‌చంద్ర‌బాబు వంటి మోడీ విమ‌ర్శ‌కులు కూడా తెలుగు వ్య‌క్తి అనే సెంటిమెంటుతో మ‌ద్ద‌తు ఇచ్చేవారు. ఈ సంద‌ర్భంలో ఒక విష‌యంలో గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని గ‌ట్టిగా వ్య‌తిరేకించే అప్ప‌టి ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశంపార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీరామారావు సైతం పి.వి.న‌ర‌సింహారావు ప్ర‌ధాని అభ్య‌ర్ధిగా నంద్యాల లోక్ స‌భ నుంచి ఉప ఎన్నిక‌లో పోటీ చేసిన‌ప్పుడు తెలుగు ఆత్మ గౌర‌వం నినాదంతో ఆయ‌న పార్టీ పోటీ చేయ‌లేదు. ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప‌ట్టు సాధించాల‌నుకున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ వెంక‌య్య‌నాయుడిని ఎంపిక చేస్తే పార్టీకి కొద్దో గొప్పో ప్ర‌యోజ‌నంగా ఉండేదే. కానీ రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు, విప‌క్ష ఐక్య‌తా ప్ర‌య‌త్నాల నేప‌ధ్యంలో న‌రేంద్ర మోడీ, అమిత్ షా రాజ‌కీయాల‌కు న‌ష్టం క‌లుగుతుందేమోన‌నే ఆలోచ‌న‌తోనే ముందు జాగ్ర‌త్త‌గానే వెంక‌య్య‌నాయుడిని ప‌క్క‌న బెట్టార‌నే వాద‌న బ‌లంగానే ఉంది.

Tags:    
Advertisement

Similar News