అగ్నివీర్ లకు ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్..
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అగ్నిపథ్ లో భాగంగా సైన్యంలో చేరిన వారు నాలుగేళ్ల తర్వాత పర్మినెంట్ కాకపోతే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారికి ఇంటర్ సర్టిఫికెట్ ఇస్తాం, ఇతర విభాగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం, డ్రిల్ టీచర్లుగా అవకాశం కల్పిస్తాం.. వంటి ప్రతిపాదనలు ఆల్రడీ వచ్చాయి. అగ్నివీర్ లను తమ పార్టీ ఆఫీసుల్లో సెక్యూరిటీగా నియమించుకుంటామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు బీజేపీ నేతలు. ఇప్పుడు ప్రైవేటు రంగం నుంచి అగ్నివీర్ లకు […]
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అగ్నిపథ్ లో భాగంగా సైన్యంలో చేరిన వారు నాలుగేళ్ల తర్వాత పర్మినెంట్ కాకపోతే ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారికి ఇంటర్ సర్టిఫికెట్ ఇస్తాం, ఇతర విభాగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం, డ్రిల్ టీచర్లుగా అవకాశం కల్పిస్తాం.. వంటి ప్రతిపాదనలు ఆల్రడీ వచ్చాయి. అగ్నివీర్ లను తమ పార్టీ ఆఫీసుల్లో సెక్యూరిటీగా నియమించుకుంటామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు బీజేపీ నేతలు. ఇప్పుడు ప్రైవేటు రంగం నుంచి అగ్నివీర్ లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా. అగ్నివీర్ లకు తమ సంస్థలో అవకాశాలిస్తామని హామీ ఇచ్చారు.
అగ్నివీర్ లు పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారి ఉపాధికి ఎలాంటి ఢోకా లేకుండా చేస్తాయని, అలాంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశం తమకు లభిస్తే స్వాగతిస్తామని చెప్పారు ఆనంద్ మహీంద్రా. ఈమేరకు ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కార్పొరేట్ రంగంలో అగ్నివీర్ ల ఉపాధికి అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు ఆనంద్ మహీంద్రా.
అగ్నివీర్ ల అనుమానాలివీ..
ఈ ఏడాది 46వేలమంది అగ్నివీర్ లను ప్రభుత్వం రిక్రూట్ చేసుకోడానికి ప్రతిపాదనలు రూపొందించింది. నాలుగేళ్ల తర్వాత వీరిలో 11,500 మంది మాత్రమే సైన్యంలో కొనసాగుతారు. అర్హత, ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేస్తారు. మిగతా 34,500 మంది నాలుగేళ్ల తర్వాత సైన్యం నుంచి బయటకు రావాల్సిందే. ఇలాంటి వారికి అప్పటికప్పుడు ఉపాధి పెద్ద సవాలేనని చెప్పాలి. ఈ నాలుగేళ్ల కాలంలో వారు మిగతా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉండదు, మిగతా ఉద్యోగాల్లో కేంద్రం 10శాతం రిజర్వేషన్ ఇచ్చినా ఎంతమంది దాన్ని ఉపయోగించుకుంటారనే విషయంలో క్లారిటీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అగ్నివీర్ లకు ప్రత్యేకంగా ఫలానా ఉపయోగాలు కల్పిస్తామని చెప్పడంలేదు. ఈ దశలో ఆనంద్ మహీంద్రా ప్రతిపాదన వినూత్నంగా ఉంది.
అయితే అసలు అగ్నిపథ్ అనే ప్రయోగమే తప్పంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. యువత ఉపాధితోపాటు.. సైన్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని చేర్చుకుంటే సైన్యం శక్తి సామర్థ్యాలు పలుచనయ్యే అవకాశముందని వాదిస్తున్నాయి. యువత మాత్రం తమ భవిష్యత్తుకి భరోసా లేకుండా పోతోందంటూ ఆందోళనబాట పట్టింది.
అగ్నిపథ్ పై ముందుకే..
అగ్నిపథ్ స్కీమ్ ను వెనక్కి తీసుకోబోయేది లేదని మిలిటరీ వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురి తాజాగా ప్రకటించారు. ఈ పథకం కింద మొదటి బ్యాచ్ అగ్నివీర్ ల నియామకం కోసం ఈ నెల 24 నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారాయన. జులై 24న అర్హత పరీక్ష నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. నిరసనల్లో పాల్గొని ఎఫ్‌ఐఆర్ నమోదైన వారిని ఆర్మీ ఉద్యోగాల్లోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు.