భారత్ లో అతి పెద్ద విధ్వంసం అదే.. ఢిల్లీలో 80శాతం అక్రమ కట్టడాలే..!
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల స్థానికులు, నాయకులు అడ్డుకోవడంతో బుల్డోజర్లు వెనక్కి వెళ్లాయి కానీ, పారా మిలటరీ సిబ్బంది సహకారంతో మిగతా చోట్ల తొలగింపులు మొదలయ్యాయి. ఇదే కొనసాగితే ఢిల్లీలో 80శాతం నిర్మాణాలు నేలమట్టం అవుతాయని హెచ్చరించారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో 80శాతం కట్టడాలు ఆక్రమణలే అని అంటున్న ఆయన.. వాటన్నింటినీ కూల్చేస్తే దేశంలోనే అతిపెద్ద విధ్వంసం అదే అవుతుందని బీజేపీపై మండిపడ్డారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ చేతుల్లో […]
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల స్థానికులు, నాయకులు అడ్డుకోవడంతో బుల్డోజర్లు వెనక్కి వెళ్లాయి కానీ, పారా మిలటరీ సిబ్బంది సహకారంతో మిగతా చోట్ల తొలగింపులు మొదలయ్యాయి. ఇదే కొనసాగితే ఢిల్లీలో 80శాతం నిర్మాణాలు నేలమట్టం అవుతాయని హెచ్చరించారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో 80శాతం కట్టడాలు ఆక్రమణలే అని అంటున్న ఆయన.. వాటన్నింటినీ కూల్చేస్తే దేశంలోనే అతిపెద్ద విధ్వంసం అదే అవుతుందని బీజేపీపై మండిపడ్డారు.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఆమ్ ఆద్మీ చేతుల్లో ఉన్నా.. మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ పాలక మండళ్లు కొలువుదీరాయి. ప్రస్తుతం ఆక్రమణల తొలగింపు ప్రక్రియ మొత్తం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో జరుగుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేతలకు బుల్డోజర్లు తీసుకెళ్తుంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ వాటికి అడ్డుపడుతుండటం విశేషం. పార్టీల మధ్య ఆధిపత్య పోరులో ఢిల్లీ వాసులు హడలిపోతున్నారు.
ఆక్రమణల తొలగింపు పేరుతో, షాపులు, ఇళ్లను కూల్చేసేందుకు బుల్డోజర్లు వస్తున్నాయి. అయితే ఢిల్లీ పట్టణం ఓ ప్రణాళిక ప్రకారం లేదని, 80శాతం ఆక్రమణలేనని, అందుకే కూల్చివేతలు మొదలైతే ఢిల్లీ నేలమట్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో దాదాపు 50లక్షల మంది ప్రజలు అనధికారిక కాలనీల్లో, 10లక్షల మంది జుగ్గీల్లో నివాసముంటున్నారని చెప్పారు కేజ్రీవాల్. కూల్చివేతలు మొదలైతే.. 60లక్షల మంది ప్రజలు నిరాశ్రయులవుతారు. అదే జరిగితే స్వతంత్ర భారతంలో ఇదే అతి పెద్ద వినాశనం అవుతుందని హెచ్చరించారు కేజ్రీవాల్.
బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేతను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకోవాలని, అవసరమైతే జైలుకెళ్లేందుకు సైతం సిద్ధంగా ఉండాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. 2017లో ఢిల్లీలోని ఉత్తర, దక్షిణ, తూర్పు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. మూడింటిలో బీజేపీ మెజార్టీ సీట్లు దక్కించుకుంది. త్వరలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీని కార్పొరేషన్లలో అధికారంలోకి తేవాలని, అప్పుడే ఆక్రమణల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు కేజ్రీవాల్. అనధికారిక కాలనీల్లో ఉంటున్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.