సర్కారువారి పాట రివ్యూ

నటీనటులు: మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, నదియా, సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.. సంగీతం: థమన్ సినిమాటోగ్ర‌ఫీ: మ‌ధి నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపీ ఆచంట కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పరశురామ్ నిడివి : 162 నిమిషాలు రేటింగ్: 2.75/5 మహేష్ ఓ సినిమా ఒప్పుకున్నాడంటే అందులో అన్ని హంగులు ఉండాల్సిందే. కేవలం కథ మాత్రమే కాకుండా పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ అనిపించినప్పుడు మాత్రమే మహేష్ ఏ సినిమాకైనా గ్రీన్ సిగ్నల్ […]

Advertisement
Update:2022-05-12 10:24 IST

నటీనటులు: మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, నదియా, సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు..
సంగీతం: థమన్
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ధి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపీ ఆచంట
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పరశురామ్
నిడివి : 162 నిమిషాలు
రేటింగ్: 2.75/5

మహేష్ ఓ సినిమా ఒప్పుకున్నాడంటే అందులో అన్ని హంగులు ఉండాల్సిందే. కేవలం కథ మాత్రమే కాకుండా పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ అనిపించినప్పుడు మాత్రమే మహేష్ ఏ సినిమాకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఎందుకంటే, ఆడియన్స్ మహేష్ నుంచి అది కోరుకుంటారు. సరిలేరు నీకెవ్వరు తర్వాత మరోసారి కమర్షియల్ మీటర్ లో మహేష్ ఎత్తుకున్న సినిమా సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి. హీరోయిజం, మాస్ సాంగ్, కామెడీ, రొమాన్స్, ఫైట్స్, ఎమోషన్.. ఇలా అన్నీ మేళవించాడు దర్శకుడు. అయితే ఈ క్రమంలో కీలకమైన నెరేషన్ ను మిస్సయ్యాడు.

అవును.. సర్కారువారి పాట సినిమాలో నెరేషన్ గాడి తప్పింది. మంచి పాయింట్ ను ఎత్తుకున్న దర్శకుడు, దాన్ని అంతే మంచిగా ప్రజెంట్ చేయలేకపోయాడు. మరీ ముఖ్యంగా కీలకమైన సెకెండాఫ్ లో, మరింత కీలకమైన ప్రీ-క్లైమాక్స్ లో పరశురామ్ రైటింగ్ ఏమంత ఆకట్టుకోదు. ఈ విషయంలో అతడ్ని తప్పుపట్టడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే కెరీర్ లోనే తొలిసారి అతడికో పెద్ద హీరో దొరికాడు. మహేష్ లాంటి స్టార్ ను హ్యాండిల్ చేయడానికి పరశురామ్ తన శక్తియుక్తులన్నీ వాడి ఉంటాడు. అలాంటి దర్శకుడు ఇక నెరేషన్ పై గ్రిప్ పెడతాడని ఆశించడం అత్యాశే అవుతుంది. అందుకే థియేటర్ల నుంచి బయటకొచ్చిన తర్వాత ఇది మహేష్ మూవీ అనిపించుకుంటుంది తప్ప, పరశురామ్ సినిమా అనిపించదు. మరీ ముఖ్యంగా ఈసారి డైలాగ్స్ లో పరశురామ్ మార్క్ కనిపించలేదు.

అమెరికాలో మహి ఫైనాన్స్ కంపెనీ పెట్టి లోన్స్ ఇస్తూ ఉంటాడు మహేష్ (మహేష్ బాబు). తన దగ్గర లోన్ తీసుకున్న వారి నుండి ముక్కు పిండి మరీ వడ్డీ వసూళ్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో చదువు కోసమని చెప్పి మహేష్ ని బుట్టలో వేసుకొని 10 వేల డాలర్లు లోన్ తీసుకొని ఆ లోన్ ఎగ్గొట్టాలని చూస్తుంది కళావతి (కీర్తి సురేష్). నిజం తెలుసుకున్న మహేష్ ఆమె తండ్రి, ఎంపీ రాజేంద్రనాధ్ దగ్గర ఆ డబ్బు వసూలు చేయడానికి వైజాగ్ వస్తాడు. అలా తను పుట్టిపెరిగిన వైజాగ్ లో మరోసారి అడుగుపెట్టిన మహేష్, కళావతి తండ్రి రాజేంద్రనాద్ నుండి పది వేల డాలర్లు కాకుండా 10 వేల కోట్ల రూపాయలు రాబట్టాలని చూస్తాడు. ఇంతకీ రాజేంద్రనాద్ పది వేల కోట్లు అప్పు ఉన్నది ఎవరికి? మహేష్ గతం ఏమిటి? అతను అమెరికా నుండి వైజాగ్ వచ్చి రాజేంద్రనాద్ ని ఎందుకు ఢీకొన్నాడు? ఫైనల్ గా రాజేంద్రనాధ్ ని భాద్యత గల ఆడపిల్ల తండ్రిగా ఎలా మార్చాడనేది ఈ సినిమా కథ.

సినిమా మొత్తం బ్యాంక్ లోన్లు, అప్పులు, రికవరీ, ఈఎంఐల చుట్టు తిరుగుతుంది. ఇలాంటి పాయింట్ కు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడం కాస్త కష్టమే. కానీ పరశురామ్ చాలా తెలివిగా, మహేష్ స్టార్ డమ్ తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను ఇందులో ఇరికించాడు. ఈ క్రమంలో అతడు కొన్ని లాజిక్స్ ను గాలికొదిలేశాడు, కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీ కూడా తీసుకున్నాడు. ఉదాహరణకు ఫస్టాఫ్ నే తీసుకుంటే, మహేష్ నుంచి కీర్తిసురేష్ 10వేల డాలర్లతో పాటు మరో 15 వేల డాలర్లు తీసుకున్నట్టు చూపిస్తారు. కానీ మహేష్ మాత్రం కేవలం 10 వేల డాలర్ల కోసమే ఇండియా వెళ్లినట్టు చూపించారు. ప్రతిచోటా 10వేల డాలర్లు అని మాత్రమే చెప్పించారు. ఇక సెకండాఫ్ లో చూసుకుంటే.. హీరోయిన్ ను ఇండియాకు రప్పించి, మహేష్ తో బలవంతంగా రొమాంటిక్ సీన్లు పెట్టాడు దర్శకుడు. దీనికితోడు క్లీన్ ఇమేజ్ ఉన్న మహేష్ తో బూతు డైలాగులు చెప్పించడం చూడ్డానికి ఇబ్బందిగా అనిపించింది. ఇవన్నీ పంటికింద రాళ్లలా తగులుతాయి.

సినిమా ఫ్లో మాత్రం బాగుంది. మహేష్ చిన్నప్పుడే తన తల్లిదండ్రుల్ని కోల్పోవడం, పెద్దయ్యాక అతడు లోన్లు ఇచ్చే సంస్థకు ఓనర్ గా మారడం, లోన్ వసూలు కోసం వైజాగ్ రావడం.. ఇంటర్వెల్ కు వచ్చేసరికి 10వేల డాలర్లు కాస్తా 10వేల కోట్ల రూపాయలుగా మారడం లాంటివి అన్నింటినీ కన్విన్సింగ్ గా చూపించారు. పెర్ ఫెక్ట్ గా ఇంటర్వెల్ కార్డు వేసిన దర్శకుడు.. సెకండాఫ్ కు వచ్చేసరికి తడబడ్డాడు. నిజానికి సెకండాఫ్ లో మహేష్-కీర్తిసురేష్-సుబ్బరాజు ట్రాక్ అవసరం లేదు. కానీ దాన్ని బలవంతంగా ఇరికించారు. ఎంతలా అంటే.. మమ..మహేషా అనే పాట కోసమే ఆ ఎపిసోడ్ మొత్తం పెట్టినట్టు అనిపిస్తుంది.

ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి దర్శకుడు పెద్దగా ప్రయోగాలు చేయదలచుకోలేదు. దీంతో క్లైమాక్స్ పార్ట్ లో మెరుపుల్లేవు. హీరో, విలన్ కు హితబోధ చేయడం, విలన్ మారిపోవడం చకచకా జరిగిపోతాయి. ఈ విషయంలో పరశురామ్ తన రైటింగ్ కంటే, హీరోయిజం కే ఎక్కువ విలువ ఇచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఉన్నంతలో పరశురామ్ సూపర్ సక్సెస్ అయిన ఎలిమెంట్ ఏదైనా ఉందంటే.. అది మహేష్ ను ఫ్రెష్ గా చూపించడమే. ఒకప్పటి పోకిరి, దూకుడులోని మహేష్ ను దించేశాడు దర్శకుడు. మహేష్ లో ఆ యాక్టివ్ నెస్ చూస్తే ముచ్చటేస్తుంది. చిన్నపిల్లాడిలా ఎగరడం, ఉత్సాహంగా దూకడం లాంటివి చూస్తుంటే.. ఈ హీరోనేనా శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాల్లో గడ్డ కట్టి బిగుసుకుపోయాడు అనే అనుమానం కలుగుతుంది. అంతలా మహేష్ ను మార్చేశాడు. దీనికితోడు అతడి కామెడీ టైమింగ్ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచింది.

మహేష్ ప్రజెన్స్ వల్లనే సినిమా స్క్రీన్ ప్లేలో చాలా తప్పులు కవర్ అయిపోయాయి. ఇక హీరోయిన్ కీర్తిసురేష్ కు చాన్నాళ్లకు మంచి గ్లామరస్ రోల్ దొరికింది. ఓవైపు గ్లామర్ గా కనిపిస్తూనే, మరోవైపు యాక్టింగ్ కుమ్మేసింది. ఓ దశలో తన పాత్రకు తగ్గట్టు మహేష్ ను ఏరా, పోరా అంటూ కీర్తిసురేష్ రెచ్చిపోయింది. ఇలాంటి సన్నివేశాల్ని కూడా మహేష్ యాక్సెప్ట్ చేస్తాడా అనిపించింది ఈ ఎపిసోడ్ చూస్తే. ఈ విషయంలో మహేష్ ను మెచ్చుకోవాల్సిందే. సముత్తరఖని, సత్యంరాజేష్, తణికెళ్ల భరని, వెన్నెల కిషోర్, నదియా.. తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.

ఓవరాల్ గా సర్కారువారి పాట సినిమాను మహేష్ వన్ మేన్ షో కోసం ఓసారి చూడొచ్చు. సెకెండాఫ్ లో చాలా కంప్లయింట్స్ ఉన్నప్పటికీ, వాటిని మహేష్ మేనియా ఏ మేరకు కప్పిపుచ్చుతుందనే విషయం రాబోయే రోజుల్లో తేలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News