పుష్ప -2 రీ లోడెడ్ వర్షన్ ఇప్పుడే కాదు!
11న కాకుండా 17న అదనపు సీన్లు యాడ్ చేస్తామన్న సినిమా యూనిట్
అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప -2 రీలోడెడ్ వర్షన్ మరింత ఆలస్యమవుతోంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈనెల 11వ తేదీన 20 నిమిషాల నిడివి కల అదనపున సన్నివేశాలను సినిమాకు జోడిస్తున్నామని మంగళవారమే మూవీ యూనిట్ ప్రకటించింది. కొన్ని టెక్నికల్ రీజన్స్ తోనే 11న కాకుండా 17వ తేదీ నుంచి పుష్ప -2 రీలోడెడ్ వర్షన్ ను చూడొచ్చని బుధవారం తిరిగి ప్రకటించింది. పుష్ప-2 మూవీ రన్ టైమ్ 3.20 గంటల 38 సెకండ్లు ఉండగా, ఇంకా 20 నిమిషాల సీన్స్ యాడ్ చేస్తున్నారు. అంటే మూవీ రన్ టైమ్ 3.40 గంటలు దాటిపోతుంది. ఇంటర్వెల్ ను కలుపుకుంటే ప్రేక్షకులు నాలుగు గంటలు థియేటర్ లో ఉండాల్సి వస్తుంది. కలెక్షన్లలో ఈ సినిమా బాహుబలి రికార్డును అధిగమించింది. ఇప్పటి వరకు రూ.1,831 కోట్లు వసూలు చేసింది. రూ.2 వేల కోట్ల వసూళ్లు సాధించేందుకే మూవీ టీమ్ రీ లోడెడ్ వర్షన్ తీసుకువస్తున్నారు. సంక్రాంతికి కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండటంతో రీ లోడెడ్ వర్షన్ వాయిదా పడిందనే టాక్ నడుస్తోంది. మూవీ టీమ్ మాత్రం టెక్నికల్ రీజన్స్‌తోనే అని చెప్తోంది.