నయనతారకు ఎలాంటి నోటీసులు పంపలేదు
తాము రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్న 'చంద్రముఖి' సినిమా నిర్మాతలు
హీరోయిన్ నయనతారకు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని 'చంద్రముఖి' సినిమా నిర్మాతలు స్పష్టం చేశారు. తాము రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అగ్ర హీరోయిన్ నయనతార జీవితంపై 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే డాక్యుమెంటరీ విడుదలైన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది అందుబాటులోకి వచ్చింది. ఇది రిలీజైన దగ్గరి నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. ఇందులో 'చంద్రముఖి'లోని కొన్ని సన్నివేశాలు ఉపయోగించడంపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటిపై ఆ సినిమా నిర్మాతలు స్పందించారు.
నయనతార తన డాక్యుమెంటరీ కోసం ముందే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు తెలిపారు. ఎక్స్ వేదికగా ఆ సర్టిఫికెట్‌ను షేర్ చేశారు.'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' తెరకెక్కించే ముందే 'రౌడీ పిక్చర్స్' సంస్థ మా వద్ద నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నది. డాక్యుమెంటరీలో చంద్రముఖిలోని సన్నివేశాలను ఉపయోగించడంపై మేము ఎలాంటి నోటీసులు పంపలేదు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చంద్రముఖి నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ పేర్కొన్నది. అలాగే రూ. కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆ సంస్థ తోసిపుచ్చింది.
ఇక .'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' లో తన పర్మిషన్ లేకుండానే నానుమ్ రౌడీ దాన్ ఫుటేజ్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్ నయనతారకు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. మూడు సెకన్ల క్లిప్‌నకు ధనుష్ రూ. 10 కోట్లు డిమాండ్ చేశారు. దీన్ని నయనతార తప్పపట్టారు.