మంత్రి వర్గం విస్తరిస్తారా..? ఏకంగా సీఎంనే దించేస్తారా..?

ఎన్నికల ఏడాది గుజరాత్ లో ముఖ్యమంత్రిని మార్చి గతంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది బీజేపీ. ఆ తర్వాత యూపీలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందని అనుకున్నా.. కేవలం మంత్రి వర్గ విస్తరణతో సరిపెట్టారు. ఇప్పుడిక కర్నాటక వంతు. గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రుల కుర్చీలాట జరిగేది. ఇప్పుడు ఆ వారసత్వాన్ని తీసుకున్న బీజేపీ సీఎంలను మార్చేస్తోంది. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు సీఎంలు వచ్చారు, ఎన్నికల టైమ్ దగ్గరపడుతున్న వేళ మరోసారి కొత్త సీఎం […]

Advertisement
Update:2022-05-03 04:06 IST

ఎన్నికల ఏడాది గుజరాత్ లో ముఖ్యమంత్రిని మార్చి గతంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది బీజేపీ. ఆ తర్వాత యూపీలో కూడా అలాంటి పరిస్థితి వస్తుందని అనుకున్నా.. కేవలం మంత్రి వర్గ విస్తరణతో సరిపెట్టారు. ఇప్పుడిక కర్నాటక వంతు. గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రుల కుర్చీలాట జరిగేది. ఇప్పుడు ఆ వారసత్వాన్ని తీసుకున్న బీజేపీ సీఎంలను మార్చేస్తోంది. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇద్దరు సీఎంలు వచ్చారు, ఎన్నికల టైమ్ దగ్గరపడుతున్న వేళ మరోసారి కొత్త సీఎం వస్తారనే ప్రచారం జోరందుకుంది. వీటన్నిటికీ హోం మంత్రి అమిత్ షా ఈరోజు తెరదించేస్తారని అంటున్నారు.

ఇటీవల కర్నాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేయడంలో సీఎం బసవరాజ్ బొమ్మై విఫలమయ్యారనే ప్రచారం ఉంది. లౌడ్ స్పీకర్ల విషయంలో కూడా కర్నాటకలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ఇటీవలే ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య విషయంలో రాష్ట్రమంత్రిపై వేటు పడింది. ఇలా వరుస పరిణామాలు కర్నాటక సర్కారుకి చిక్కులు తెచ్చిపెట్టాయి. మంత్రులు, ఇతర నాయకులపై బొమ్మైకి పట్టు దొరకలేదు. పాలనపై ఆయన మార్క్ కూడా కనిపించట్లేదు. దీంతో మరోసారి సీఎంని మార్చేందుకు బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోందనే పుకార్లు వచ్చాయి. రాష్ట్ర నాయకత్వంపై నిర్ణయాలు తీసుకునే అధికారం బీజేపీ అధిష్టానానికి ఉందని పార్టీ జాతీయ సెక్రటరీ సంతోష్‌ చేసిన వ్యాఖ్యలు ఈ పుకార్లకు బలం చేకూరుస్తున్నాయి. గుజరాత్‌ లాగే, కర్నాటకలో కూడా ఎన్నికల ఏడాది సీఎంని మార్చే అవకాశముందని తెలుస్తోంది.

మంత్రి వర్గ విస్తరణ ఖాయం..
2023లో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ దశలో అసంతృప్తులను బుజ్జగించేందుకు మంత్రి వర్గ విస్తరణ చేపట్టబోతున్నారు. యడ్యూరప్ప వర్గాన్ని కూడా సంతోషపరిచేందుకు ఆలోచిస్తోంది బీజేపీ అధిష్టానం. అయితే సీఎం మార్పుపై మాజీ సీఎం యడ్యూరప్ప విభిన్నంగా స్పందించారు. సీఎం మార్పు ఉండబోదని అంటున్నారాయన. భారంగా ఆ సీటునుంచి దిగిపోయిన ఆయన.. తాజా సీఎం బసవరాజ్ బొమ్మై పాలనపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. బొమ్మై తన బాధ్యతలను గొప్పగా నిర్వర్తిస్తున్నారని అన్నారు యడ్యూరప్ప. నాయకత్వ మార్పు కేవలం ఊహాగానమేనని కొట్టిపారేశారు.

Tags:    
Advertisement

Similar News