అయిననూ.. సోనియానే అధినేత్రి..

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత భవిష్యత్ కార్యాచరణకోసం ఆ పార్టీ నాయకులు కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే యధావిధిగా.. అందరూ గాంధీ కుటుంబ నాయకత్వాన్నే కోరుకున్నారు, అధినేత్రిగా సోనియానే కొనసాగాలన్నారు. ఓ దశలో పార్టీ తాత్కాలిక ప్రెసిడెంట్ గా ఉన్న సోనియా గాంధీ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగినా అవేవీ నిజం కాలేదు. సోనియాతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పార్టీ పదవులకు రాజీనామా చేయలేదు. […]

Advertisement
Update:2022-03-14 01:53 IST

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత భవిష్యత్ కార్యాచరణకోసం ఆ పార్టీ నాయకులు కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే యధావిధిగా.. అందరూ గాంధీ కుటుంబ నాయకత్వాన్నే కోరుకున్నారు, అధినేత్రిగా సోనియానే కొనసాగాలన్నారు. ఓ దశలో పార్టీ తాత్కాలిక ప్రెసిడెంట్ గా ఉన్న సోనియా గాంధీ తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగినా అవేవీ నిజం కాలేదు. సోనియాతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పార్టీ పదవులకు రాజీనామా చేయలేదు. చివరకు సోనియా గాంధీయే మా అధ్యక్షురాలు అంటూ సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రకటించి పుకార్లకు తెరదించారు.

అంతర్మథనం జరిగిందా..?
పంజాబ్ లో అధికారం చేజారింది. మిగతా చోట్ల కూడా అత్తెసరు మార్కులే. బీజేపీ మరింత బలంగా మారడంతోపాటు, కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతూ పోతుండగా.. ఆమ్ ఆద్మీలాంటి పార్టీల ప్రాబల్యం పెరుగుతోంది. ఈ దశలో సీడబ్ల్యూసీ మీటింగ్ అంటే కచ్చితంగా కీలక నిర్ణయాలేవో తీసుకుంటారనే అంచనాలున్నాయి. కానీ కాంగ్రెస్ చరిత్ర తెలిసినవారెవరూ ఆ సాహసాలపై నమ్మకం పెట్టుకోలేదు. గతంలో లేఖాస్త్రాలు సంధించిన జీ-23 అసమ్మతి నేతలు కూడా మీటింగ్ కి హాజరైనా పెద్దగా ప్రతిఘటించలేదు. దీంతో దాదాపు నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం.. ఎలాంటి సంచలనాలకు వేదిక కాకుండానే ముగిసింది. అసలు అంతర్మథనం జరిగిందా లేక గాంధీ కుటుంబంపై తమ విధేయతను మరోసారి నిరూపించుకోడానికే నాయకులు సమావేశమయ్యారా అనే అనుమానం మొదలైంది.

ఎంతకాలం తాత్కాలికం..
ఓవైపు రాహుల్ గాంధీ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టడానికి వెనకాడుతున్నారు. మరోవైపు ఆ బాధ్యతల్ని గాంధీ కుటుంబానికి మినహా వేరేవారికి కట్టబెట్టేందుకు ఎవరికీ ఇష్టం లేదు. కొంతమంది అసమ్మతి స్వరం వినిపించినా లాభం లేకుండా పోయింది. చివరకు కాంగ్రెస్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. థర్డ్ ఫ్రంట్ వంటి ఊహాగానాలు కొట్టిపారేస్తూ.. కాంగ్రెస్ లేకుండా ప్రాంతీయ పార్టీలేవీ బీజేపీని ఎదిరించలేవు అని చెప్పుకుంటున్నారు నేతలు. తీరా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభ మరింత తగ్గిపోయింది. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుందేమోనని ఆశించినవారంతా ఉసూరుమన్నారు. రాహుల్ ధైర్యం చేయలేనంత కాలం.. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలితో నెట్టుకు రావాల్సిందే.

Tags:    
Advertisement

Similar News