ఆలయాల జీర్ణోద్ధరణకు టీటీడీ భారీ చేయూత..

పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. చిన్నపాటి ఆదాయం ఉన్న గుడులలో నిత్యం ధూప దీప నైవేద్యాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఇకపై ప్రతి ఏడాదీ రూ.50కోట్లు వితరణ చేస్తుంది. ఈ మొత్తాన్ని దేవాదాయ శాఖకు సమకూరుస్తుంది.

Advertisement
Update:2021-09-04 06:48 IST

పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ.. ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. చిన్నపాటి ఆదాయం ఉన్న గుడులలో నిత్యం ధూప దీప నైవేద్యాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఇకపై ప్రతి ఏడాదీ రూ.50కోట్లు వితరణ చేస్తుంది. ఈ మొత్తాన్ని దేవాదాయ శాఖకు సమకూరుస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీచేసింది. ప్రతి ఐదేళ్లకోసారి 10 శాతం చొప్పున ఈ సహాయాన్ని పెంచాలని ఆర్డినెన్స్‌ లో పేర్కొన్నారు. టీటీడీ నుంచి వచ్చే నిధులన్నీ నేరుగా దేవాదాయ శాఖకు చేరుతాయని స్పష్టం చేశారు.

గతంలో కూడా టీటీడీ దేవాదాయ శాఖకు ఆర్థిక సాయం అందించేది. అయితే అది కేవలం రూ.2.25 కోట్లు మాత్రమే. ఇప్పుడది ఏకంగా రూ.50కోట్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకొచ్చిన సవరణ ప్రకారం.. దేవదాయ శాఖ పరిధిలో ఉండే సర్వశ్రేయో నిధి (కామన్‌ గుడ్‌ ఫండ్‌–సీజీఎఫ్‌)కి టీటీడీ రూ.40కోట్లు ఇస్తుంది. గతంలో ఇది రూ.1.25 కోట్లు గా ఉండేది. ఆలయాల జీర్ణోద్ధరణ, ఆగమ, వేద పాఠశాలల నిర్వహణ.. ధూపదీప నైవేద్యాలకు ఈ నిధులు వినియోగిస్తారు.

అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ నిధికి టీటీడీ ఇకపై రూ.5కోట్లు ఇవ్వబోతోంది. ఇప్పటి వరకూ సంక్షేమ నిధికి టీటీడీ ఏటా రూ.50లక్షలు ఇచ్చేది. దేవదాయ శాఖ పరిపాలన నిధికి కూడా గతంలో టీటీడీ ఇచ్చే రూ.50లక్షల నిధిని రూ.5 కోట్లకు పెంచారు.

ఇతర ఆలయాలు ఇలా..


రాష్ట్రంలో భారీగా ఆదాయం వచ్చే దేవస్థానాలన్నీ, చిన్న చిన్న ఆలయాల నిర్వహణ, పురాతన ఆలయాల పునరుద్ధరణ, వేద పాఠశాలల నిర్వహణ వంటి కార్యక్రమాలకోసం దేవాదాయ శాఖకు నిధులు సమకూరుస్తుంటాయి. శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానం, శ్రీకాళహస్తీశ్వరుడి దేవస్థానం, విజయవాడ దుర్గగుడి, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, ద్వారకా తిరుమల, సింహాచలం, కాణిపాకం వినాయకుడి దేవస్థానాలు ఒక్కొక్కటీ రూ.10 కోట్లకు పైగా అందజేస్తున్నాయి. 2019–20లో శ్రీశైలం ఆలయం ఒక్కటే రూ.32 కోట్లు సమకూర్చింది. ఈ క్రమంలో ఇప్పుడు టీటీడీ తరపున ఏటా రూ.50కోట్ల భారీ సహాయం అందబోతోంది.

Tags:    
Advertisement

Similar News