కౌశిక్ ఓ వైపు.. సీనియర్లు మరోవైపు.. కాంగ్రెస్‌లో విచిత్ర పరిస్థితి?
ఈటల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. ఈటల రాజేందర్‌పై ఇటీవల భూ కబ్జా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్‌కు అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి మద్దతు లభించింది. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాక […]
ఈటల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం ప్రస్తుతం కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది. ఈటల రాజేందర్‌పై ఇటీవల భూ కబ్జా ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్‌కు అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల నుంచి మద్దతు లభించింది. తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాక ఆయన బీసీ నాయకుడు కూడా. దీంతో ఆయనకు వివిధ వర్గాల మద్దతు దక్కింది.
ఇటీవల ఈటల రాజేందర్ కొందరు ఉద్యమకారులను, వివిధ పార్టీల నేతలను కూడా కలుస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వీహెచ్, దాసోజు శ్రవణ్, జీవన్‌రెడ్డి తదితరులు ఈటలకు మద్దతుగా నిలిచారు. సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్‌పై కుట్రలు చేసి.. ఆయనను బయటకు పంపించాలని చూస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్కు చెందిన చాలా మంది నేతలపై అవినీతి ఆరోపణలు వచ్చాయని.. కానీ ఒక్క ఈటల రాజేందర్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని వారంతా ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలంతా ఈటల రాజేందర్‌కు మద్దతు తెలుపుతుంటే.. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి మాత్రం ఈటల కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఓ స్టాండ్ తీసుకుంటే కౌశిక్ రెడ్డి మరో స్టాండ్ తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
టీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఈటల రాజేందర్‌పై పెద్దగా బహిరంగ ఆరోపణలు చేయడం లేదు. ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ , మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ మాత్రం ఈటలపై విమర్శలు చేశారు. ఆ తర్వాత వాళ్లు కూడా సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉంటే హుజురాబాద్‌కు చెందిన కాంగ్రెస్ ఇంచార్జి పాడి కౌశిక్ రెడ్డి ఈటలపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కౌశిక్‌రెడ్డి .. ప్రస్తుతం ఈటలపై విరుచుకుపడుతున్నారు. వివిధ న్యూస్ చానల్స్ లో లైవ్ డిబేట్లలో పాల్గొంటూ ఈటల రాజేందర్‌పై ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఈటలకు మద్దతు ఇస్తుండగా.. పాడి కౌశిక్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు.
త్వరలో ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీచేసే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదంతా జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఉలుకు పలుకు లేకుండా చూస్తున్నది. మరోవైపు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి సమీప బంధువు కూడా. ఆయన గతంలో కొంతకాలం క్రికెటర్‌గా రాణించారు.