గంగా మృతదేహాలు.. యూపీ వర్సెస్ బీహార్..

గత రెండు రోజులుగా గంగా నదిలో తేలియాడుతూ వస్తున్న మృతదేహాల విషయంలో బీహార్ ప్రభుత్వం స్పందించింది. అవన్నీ ఉత్తర ప్రదేశ్ నుంచి తమ రాష్ట్రంలోకి కొట్టుకొచ్చిన మృతదేహాలని స్పష్టం చేసింది. పరోక్షంగా యూపీ వ్యవహారంపై మండిపడింది. మృతదేహాల్ని అలా గంగా నదిలో వదిలిపెట్టడం సరికాదని, గంగా నీటిని నిత్యావసరాలకోసం వాడుకునే బీహార్ వాసుల ప్రాణాలను బలిచేస్తారా అంటూ మండిపడింది. బక్సర్‌ జిల్లాలో గంగా తీరం వెంబడి మొత్తం 71 మృతదేహాలను తాము వెలికితీశామని బీహార్‌ జల వనరుల […]

Advertisement
Update:2021-05-12 08:06 IST

గత రెండు రోజులుగా గంగా నదిలో తేలియాడుతూ వస్తున్న మృతదేహాల విషయంలో బీహార్ ప్రభుత్వం స్పందించింది. అవన్నీ ఉత్తర ప్రదేశ్ నుంచి తమ రాష్ట్రంలోకి కొట్టుకొచ్చిన మృతదేహాలని స్పష్టం చేసింది. పరోక్షంగా యూపీ వ్యవహారంపై మండిపడింది. మృతదేహాల్ని అలా గంగా నదిలో వదిలిపెట్టడం సరికాదని, గంగా నీటిని నిత్యావసరాలకోసం వాడుకునే బీహార్ వాసుల ప్రాణాలను బలిచేస్తారా అంటూ మండిపడింది. బక్సర్‌ జిల్లాలో గంగా తీరం వెంబడి మొత్తం 71 మృతదేహాలను తాము వెలికితీశామని బీహార్‌ జల వనరుల శాఖ మంత్రి సంజయ్‌ కుమార్‌ చెప్పారు. వాటన్నింటికీ పోస్ట్‌ మార్టం నిర్వహించి, ప్రొటోకాల్‌ ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేశామని వెల్లడించారు. మృతదేహాలు కొవిడ్‌ బాధితులవేనని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారాయన.

తాజాగా ఉత్తర ప్రదేశ్‌ లోని బలియా, గాజీపూర్‌ జిల్లాల్లో పదుల సంఖ్యలో శవాలు గంగా నదిలో తేలియాడుతూ కనిపిస్తున్నాయి. బలియా జిల్లాలోని ఉజియార్‌, కుల్హడియా, భరూలీ ఘాట్‌ లకు దాదాపు 50 మృతదేహాలు కొట్టుకువచ్చాయని స్థానికులు తెలిపారు. చౌసాలోని మహాదేవ్ ఘాట్ వద్ద కిలోమీటర్‌ పరిధిలో 48 మృతదేహాలను గుర్తించారు. కరోనా మృతులకు అంత్యక్రియలు నిర్వహించకుండా ఇలా గంగా నదిలోకి విసిరేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నదిలో విసిరివేయగా ఒడ్డుకు కొట్టుకొచ్చిన మృతదేహాలను రాబందులు, కుక్కలు పీక్కుతినడం మరింత దారుణం.

యూపీ నుంచి బీహార్ వరకు గంగా తీరంలో 500పైగా మృతదేహాలున్నట్టు అనుమానిస్తున్నారు. గంగా పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు ఈ నీటినే వినియోగిస్తుంటారు. వందల సంఖ్యలో కరోనా మృతదేహాలను అలాగే నీటిలో పడేయటం వల్ల జలాలు కలుషితం అయి, కొత్త వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందని భయపడుతున్నారు స్థానికులు.

మరోవైపు యమునా నదిలో కూడా భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ లోని హామిర్‌ పూర్‌, కాన్పూర్‌ జిల్లాల్లోని గ్రామాల్లో కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతుండటం, శ్మశానవాటికలు నిండిపోతుండటంతో మృతదేహాలకు అంత్యక్రియలు జరపకుండా ఇలా నదిలో పడేస్తున్నారని అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని కొన్ని మృతదేహాలను కొంతమంది అధికారులే ఇలా నదిలో వదిలేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే హామిర్ పూర్ ఎస్పీ వాదన మరోలా ఉంది. హామిర్ పూర్, కాన్పూర్ జిల్లాల్లోని కొన్ని తెగలకు మృతదేహాలను కాల్చడం, పూడ్చడం అలవాటు లేదని, వారు నేరుగా మృతదేహాలను నదిలో వదిలేస్తారని అంటున్నారాయన. యమునా నదిలో అప్పుడప్పుడు ఇలా మృతదేహాలు తేలుతూ కనిపిస్తాయని చెబుతున్నారు.

మొత్తమ్మీద గంగా నదిలో మృతదేహాలను విడిచిపెట్టడం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్, బీహార్ మధ్య చిచ్చు పెట్టింది. యూపీ ప్రభుత్వంపై బీహార్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంగా కరోనా మృతదేహాలను వదిలేయడం సరికాదని, వెంటనే దీన్ని ఆపేయాలని, యూపీ అధికారులు ఘాట్ ల వద్ద నిఘా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News