బెంగాల్ బీజేపీలో ముకుల్ వర్సెస్ సువేందు..

బెంగాల్ బీజేపీ శాసన సభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. అయితే ఈ తొలి శాసన సభాపక్ష సమావేశానికి 77మంది బీజేపీ ఎమ్మెల్యేలలో కేవలం 22మంది మాత్రమే హాజరు కావడం విశేషం. సువేందు ఎన్నికను వారు వ్యతిరేకించారా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే చర్చ మొదలైంది. అయితే తృణమూల్‌ దాడుల నుంచి కార్యకర్తలను రక్షించుకోవడం కోసం మిగిలిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ చెప్పారు. అదే సమయంలో బీజేపీ […]

Advertisement
Update:2021-05-11 04:43 IST

బెంగాల్ బీజేపీ శాసన సభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. అయితే ఈ తొలి శాసన సభాపక్ష సమావేశానికి 77మంది బీజేపీ ఎమ్మెల్యేలలో కేవలం 22మంది మాత్రమే హాజరు కావడం విశేషం. సువేందు ఎన్నికను వారు వ్యతిరేకించారా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా అనే చర్చ మొదలైంది. అయితే తృణమూల్‌ దాడుల నుంచి కార్యకర్తలను రక్షించుకోవడం కోసం మిగిలిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఉన్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ చెప్పారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలందరికీ కేంద్రం భద్రత పెంచడం విశేషం. ఇప్పటికే సువేందు అధికారికి జడ్ కేటగిరీ భద్రత ఉండగా, 61మందికి ఎక్స్ కేటగిరీ, మిగతా వారికి వై కేటగిరీ భద్రత కల్పించింది కేంద్రం.

ముకుల్ రాయ్ ని పక్కనపెట్టారా..?
బెంగాల్ బీజేపీలో రెండు వర్గాలున్నాయనే మాట వాస్తవం. బీజేపీ సీనియర్లు, తృణమూల్ మాజీలు అంటూ రెండు కేటగిరీల నాయకులున్నారు. వీరిలో తృణమూల్ మాజీలదే పైచేయి. దీనికి నిదర్శనంగానే సువేందు అధికారికి ప్రతిపక్షనేతగా పట్టం కట్టింది అధిష్టానం. మమతా బెనర్జీని ఓడించారన్న కారణంగా ఆయనకు వీరతాడు వేశారు. అయితే అదే సమయంలో ఆ స్థానాన్ని ఆశిస్తున్న ముకుల్ రాయ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా కీలక పదవిపై ఆశలు పెట్టుకోలేదు కానీ, ముకుల్ రాయ్ మాత్రం బీజేపీ గెలిస్తే తానే సీఎం అని భావించారు. గతంలో యూపీఏ హయాంలో ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పటి వరకూ రైల్వేమంత్రిగా ఉన్న మమత, తాను బెంగాల్ సీఎంగా వెళ్లిపోతూ ముకుల్ పేరు రికమండ్ చేశారు. మమతకు అంత నమ్మకస్తుడిగా ఉండి కూడా ఆయన 2017లో బీజేపీలో చేరారు. ముకుల్, సువేందు ఇద్దరూ గతంలో తృణమూల్ కీలక నేతలే అయినా.. బీజేపీలో సువేందుకంటే ముకుల్ రాయ్ సీనియర్ అయ్యారు. కొత్తగా వచ్చిన సువేందు అధికారికి ప్రతిపక్షనేత పదవి ఇవ్వడంతో ముకుల్ వర్గం అసంతృప్తికి లోనయింది. ముకుల్ రాయ్ ఎమ్మెల్యేగా గెలిచినా, ఆయన తనయుడు మాత్రం ఓడిపోయారు. అటు తూర్పు మిడ్నపూర్ ప్రాంతంలో సువేందు వర్గం మొత్తం ఓడిపోగా.. ఆయన ఒక్కరే గెలిచారు. అయితే సువేందు, ఏకంగా ముఖ్యమంత్రి మమతాని ఓడించడం ఆయనకు కలిసొచ్చిన అంశం.

సయోధ్య సాధ్యమేనా..
మూడోసారి భారీ మెజార్టీతో బెంగాల్ సీఎం పీఠాన్ని అధిరోహించిన మమతా బెనర్జీని అసెంబ్లీలో అడ్డుకోవాలంటే బలమైన ప్రతిపక్షనేత కావాలి. సువేందుకి ఆ సత్తా ఉందని భావించిన అధిష్టానం ఆయనకు పదవి కట్టబెట్టింది. అదే సమయంలో ముకుల్ రాయ్ వర్గాన్ని బుజ్జగించే ఏర్పాట్లు చేస్తోంది. వీరిద్దరు కలసి పనిచేస్తేనే.. టీఎంసీని నిలువరించడం సాధ్యమని భావిస్తోంది బీజేపీ. అందుకే ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా.. జోడు గుర్రాల సవారీ చేయాలనుకుంటోంది. మరి బెంగాల్ బీజేపీలో ఎంత సఖ్యత ఉందో తేలాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News