ఆక్సిజన్ పై కేంద్రానికి సుప్రీం అల్టిమేట్టం..
“సకాలంలో సరైన పరిమాణంలో ఆక్సిజన్ సరఫరా చేయండి, లేకపోతే మేం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది.” అంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు అల్టిమేట్టం ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీకి ప్రతి రోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి తీరాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ ఆదేశాల్ని అమలు చేయకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించింది. నిర్ణీత కేటాయింపుల మేరకు ఢిల్లీకి ఆక్సిజన్ ఇవ్వకపోవడంపై.. కేంద్ర ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై […]
“సకాలంలో సరైన పరిమాణంలో ఆక్సిజన్ సరఫరా చేయండి, లేకపోతే మేం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది.” అంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు అల్టిమేట్టం ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీకి ప్రతి రోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసి తీరాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తమ ఆదేశాల్ని అమలు చేయకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించింది. నిర్ణీత కేటాయింపుల మేరకు ఢిల్లీకి ఆక్సిజన్ ఇవ్వకపోవడంపై.. కేంద్ర ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అధికారులను అరెస్టు చేస్తే ఆక్సిజన్ రాదని, స్టే విధించిన సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే ఈ వ్యవహారంలో అధికారులను తప్పుబట్టలేమంటూనే.. కేంద్రానికి చీవాట్లు పెట్టింది. కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది.
ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరా విషయంపై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘‘ప్రతి రోజూ ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని మేం కోరుతున్నాం. ఇది ఆచరణలోకి రావాలి. కంటెయినర్లు లేవు, రవాణాలో ఇబ్బందులు ఉన్నాయంటూ రకరకాల కారణాలు చెప్పడం కుదరదు. మేం కఠినంగా వ్యవహరించే పరిస్థితులను దయచేసి తీసుకురావద్దు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కర్నాటక హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేం..
తగినంత ఆక్సిజన్ లేకుండా కర్నాటక ప్రజలను నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టలేమని ఇదే ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రానికి రోజువారీ ఇస్తున్న ఆక్సిజన్ కోటాను 965 మెట్రిక్ టన్నుల నుంచి 1200 మెట్రిక్ టన్నులకు పెంచాలని కర్నాటక హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇలా హైకోర్టులు ఆదేశాలు ఇస్తూ పోతుంటే ఆక్సిజన్ సరఫరా చేయడం ఇబ్బందికరంగా మారుతుందని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అన్నింటినీ పరిశీలించిన తరువాతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, దీంట్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది.