వ్యాక్సిన్ ధరలపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం..
భారత్ లో వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రానికి ఒకరేటు, రాష్ట్రాలకు మరో రేటు, ప్రైవేటు ఆస్పత్రులకు ఇంకో రేటు చొప్పున ధరలు నిర్ణయించి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నాయి. కేంద్రానికి ఇచ్చిన రిబేటుని రాష్ట్రాలకు ఆయా సంస్థలు ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో అసలు కేంద్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎందుకు పూర్తి స్థాయిలో తన అధీనంలోకి తీసుకోకూడదంటూ సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. వ్యాక్సిన్ ధరల్లో తేడా ఎందుకు ఉందని, వందశాతం వ్యాక్సిన్ ని ఉత్పత్తిదారులనుంచి కేంద్రమే సేకరించి రాష్ట్రాలకు సరఫరా […]
భారత్ లో వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్రానికి ఒకరేటు, రాష్ట్రాలకు మరో రేటు, ప్రైవేటు ఆస్పత్రులకు ఇంకో రేటు చొప్పున ధరలు నిర్ణయించి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నాయి. కేంద్రానికి ఇచ్చిన రిబేటుని రాష్ట్రాలకు ఆయా సంస్థలు ఇవ్వడంలేదు. ఈ నేపథ్యంలో అసలు కేంద్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎందుకు పూర్తి స్థాయిలో తన అధీనంలోకి తీసుకోకూడదంటూ సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. వ్యాక్సిన్ ధరల్లో తేడా ఎందుకు ఉందని, వందశాతం వ్యాక్సిన్ ని ఉత్పత్తిదారులనుంచి కేంద్రమే సేకరించి రాష్ట్రాలకు సరఫరా చేయొచ్చు కదా అని ప్రశ్నించింది.
దేశంలో కరోనా సంక్షోభం, నిర్వహణ అంశాలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరుపుతోంది. దేశంలో కరోనా వ్యాప్తి కట్టడి, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై త్రిసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
వ్యాక్సిన్ తయారీదారులు డోసులు అందించే క్రమంలో రాష్ట్రాల మధ్య సమానత్వాన్ని ఎలా పాటిస్తున్నారని, నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం విధివిధానాలను కేంద్రం ఎందుకు పాటించట్లేదని సుప్రీం ప్రశ్నించింది. దేశంలో 18-45 ఏళ్ల మధ్య ఉన్న జనాభా ఎంత? వ్యాక్సిన్ ఉత్పత్తి పెంపులో కేంద్రం పెట్టుబడి ఎంత? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కరోనా చికిత్స ధరలను కేంద్రం ఏ విధంగా నియంత్రిస్తుందో చెప్పాలని కోర్టు సూచించింది. వైద్య సిబ్బంది కొరతను ఎలా అధిగమిస్తున్నారని ప్రశ్నించింది.
ఆక్సిజన్ ట్యాంకర్లు, సిలిండర్లు అన్ని ఆసుపత్రులకు చేరేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, ఎంతవరకు సరఫరా చేయగలుగుతున్నారని ప్రశ్నించిన సుప్రీం, లాక్ డౌన్ తరహాలో తీసుకున్న ఆంక్షలు, చర్యలపై కేంద్రాన్ని వివరాలు అడిగింది. 18ఏళ్లు దాటినవారికి వ్యాక్సిన్ ఇచ్చే విషయంపై రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా నిశితంగా విమర్శించింది సుప్రీం కోర్టు. నిరుపేదలు, నిరక్షరాస్యులకు ఇంటర్నెట్ సదుపాయం ఉందా? అలాంటి వారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయిస్తున్నారు? అని ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి పేదలు, అణగారిన వర్గాలవారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు, వ్యాక్సినేషన్ ప్రైవేటు రంగంలో ఉండకూడదని పేర్కొంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలో అమలవుతున్న జాతీయ రోగ నిరోధక విధానాన్ని అమలు చేయడం ఇప్పుడు కూడా తప్పనిసరి అని తెలిపింది.
శ్మశాన వాటికల్లో పనిచేసే వారికి టీకా ఎలా ఇస్తున్నారని, పేటెంట్ చట్టంలోని సెక్షన్ 92ను కేంద్రం అమలు చేస్తోందా అని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. మన దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు 70 ఏళ్లనాటివని, ప్రస్తుత ప్రొసీడింగ్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాలను కానీ విమర్శించడానికి కాదని వివరించింది. ప్రజల ఆరోగ్యం పట్ల మాత్రమే తాము శ్రద్ధ చూపుతున్నామని, తప్పొప్పులను నిర్ణయించేందుకు కాదని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం ఆసుపత్రులు, ఆలయాలు, మసీదులు, ఇతర మతపరమైన ప్రదేశాలను అందుబాటులో ఉంచాలని సూచించింది.
కరోనా సమయంలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను పౌరులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆ వేదికలపై సాయం కోరడాన్ని తప్పుడు సమాచారం అనలేమని, అలాంటి ట్వీట్లు, పోస్టులపై చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలా చర్యలు తీసుకుంటే దాన్ని కోర్టు ధిక్కరణగా భావించాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రజల గళాన్ని విందామని, సమాచారాన్ని అణచిపెట్టవద్దని కోరింది.
మొత్తమ్మీద భారత్ లో వ్యాక్సినేషన్ విధానం లోపభూయిష్టంగా ఉందనే అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. వ్యాక్సిన్ తయారీ సంస్థలనుంచి కేంద్రమే టీకాలు సేకరించి, వాటిని ప్రజలకు పంపిణీ చేయాలని సూచించింది. ప్రభుత్వ పర్యవేక్షణలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పింది.