సొంత పార్టీ నేతలకు స్టాలిన్ వార్నింగ్..
ఎన్నికల వేళ నోరు జారొద్దు, పార్టీ పరువు తీయొద్దు, మీకు మీరే కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దంటూ డీఎంకే అధినేత స్టాలిన్ సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలకు వెనకాడబోనని కూడా తేల్చి చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమిళనాడు సీఎం పళనిస్వామిని టార్గెట్ చేస్తూ రాజా కాస్త శృతి మించారు. డీఎంకేలో […]
ఎన్నికల వేళ నోరు జారొద్దు, పార్టీ పరువు తీయొద్దు, మీకు మీరే కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దంటూ డీఎంకే అధినేత స్టాలిన్ సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా హద్దు మీరితే కఠిన చర్యలకు వెనకాడబోనని కూడా తేల్చి చెప్పారు.
కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమిళనాడు సీఎం పళనిస్వామిని టార్గెట్ చేస్తూ రాజా కాస్త శృతి మించారు. డీఎంకేలో కార్యకర్తగా తన స్థానాన్ని మొదలు పెట్టి, అంచెలంచెలుగా ఎదిగి, చివరకు పార్టీ అధినేతగా స్టాలిన్ మారారంటూ గొప్పగా చెప్పిన రాజా.. అదే సమయంలో సీఎం పళనిస్వామిని అవకాశవాదిగా అభివర్ణించారు. చట్టబద్ధమైన పెళ్లి ద్వారా, 300 రోజులపాటు తల్లికడుపులో పెరిగి, బయటకొచ్చిన సంపూర్ణ ఆరోగ్యవంతుడైన బిడ్డ స్టాలిన్ అయితే, తమిళనాడులో అక్రమ సంబంధం ద్వారా పుట్టిన నెలతక్కువ బిడ్డ పళనిస్వామి అంటూ ఘాటుగా విమర్శించారు. స్టాలిన్ ని ఆకాశానికెత్తేసే క్రమంలో.. పళనిస్వామిపై రాజా చేసిన వ్యాఖ్యలు స్థాయి తక్కువగా ఉన్నాయంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో స్టాలిన్ పార్టీ నేతలందరికీ కలిపి ఒకేసారి వార్నింగ్ ఇచ్చారు. గెలుపు మాత్రమే ముఖ్యం కాదు, దానికోసం మనం వెళ్లే దారి కూడా ముఖ్యం అని చెప్పారు. డ్యూటీ-డిగ్నిటీ-డిసిప్లైన్.. మన నాయకుడు చెప్పిన ఈ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఇటీవలే పరువు తీసిన దిండిగల్ లియోని..
డీఎంకే నాయకుడు దిండిగల్ లియోని.. ఇటీవల మహిళల శరీర ఆకృతి గురించి చేసిన కామెంట్లు కూడా ఆ పార్టీ పరువుని బజారున పడేశాయి. గతంలో మహిళలు 8 అంకె ఆకారంలో అందమైన శరీరాకృతితో ఉండేవారని, పిల్లల్ని ఎత్తుకుని నడుముపై పెట్టుకుంటే వారు జారిపోకుండా ఉండేవారని, కానీ ఈ తరం మహిళలు విదేశీ ఆవుల పాలు తాగి డ్రమ్ముల్లా మారిపోయారంటూ నీఛంగా మాట్లాడారు లియోని. ఈ వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. కనిమొళి కూడా తీవ్రంగా స్పందించారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడితే పార్టీలకు సంబంధం లేకుండా తరిమికొడతామంటూ ధ్వజమెత్తారు.
వరుసగా పార్టీ పరువు బజారుకీడుస్తున్న నాయకుల్ని చూసి కాస్త త్వరగానే రియాక్ట్ అయ్యారు స్టాలిన్. ఎన్నికలకు ముందు ఇంకెవరూ నోరు జారకుండా కట్టడి చేస్తున్నారు. పార్టీ పరువు తీసేలా మాట్లాడొద్దని, ఎన్నిక సమయంలో ప్రతి మాటా ఒకటికి వందసార్లు ఆలోచించుకుని మాట్లాడాలని హితవు చెప్పారు.