స్వాతంత్ర సంబరాలకు కమిటీ.. తెలుగు ప్రముఖులకు చోటు..
భారత ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్-15 నుంచి వచ్చే ఏడాది ఆగస్ట్ 15 వరకు ఏడాది పొడవునా సంబరాలు నిర్వహించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని.. పురస్కరించుకుని ఉన్నతస్థాయి జాతీయకమిటీని ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో 259మంది సభ్యులుంటారు. ఈ కమిటీకి కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్రసింగ్ సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు. […]
భారత ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్-15 నుంచి వచ్చే ఏడాది ఆగస్ట్ 15 వరకు ఏడాది పొడవునా సంబరాలు నిర్వహించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని.. పురస్కరించుకుని ఉన్నతస్థాయి జాతీయకమిటీని ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో 259మంది సభ్యులుంటారు. ఈ కమిటీకి కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్రసింగ్ సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు.
తెలుగు ప్రముఖులకు చోటు..
75వ స్వాతంత్ర దినోత్సవంకోసం ఏర్పాటు చేసిన కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రుల హోదాలో కేసీఆర్, జగన్, గవర్నర్ హోదాలో బండారు దత్తాత్రేయ, రాజకీయ పార్టీల నుంచి చంద్రబాబు, సీతారాం ఏచూరి, విభిన్న రంగాల నుంచి రామోజీ రావు, సినీ దర్శకుడు రాజమౌళి, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, మిథాలీరాజ్ లకు స్థానం దక్కింది.
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే సహా.. సోనియా గాంధీ, అద్వాణీ, లతా మంగేష్కర్.. ఇలా ప్రముఖులందరికీ స్థానం కల్పించారు. సినిమా రంగం నుంచి ఏఆర్ రెహమాన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఇళయరాజా, కేజే ఏసుదాస్ ఇందులో సభ్యులుగా నియమితులయ్యారు. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఈ కమిటీ నిర్ణయిస్తుంది.
తొలి సమావేశం ఈ నెల 8న..
ఏడాది పొడవునా స్వాతంత్ర సంబరాలు ఎలా చేయాలి, ఎలాంటి వినూత్న రీతులో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలనే విషయంపై ఈ కమిటీ నివేదిక రూపొందిస్తుంది. తక్షణం ఈ కమిటీ అమలులోకి వచ్చినట్టేనని కేంద్రం ప్రకటించింది. ఇక కోఆప్ట్ మెంబర్ల నిర్ణయం కూడా కమిటీకే వదిలేసింది. వివిధ రంగాల ప్రముఖుల్ని కోఆప్ట్ మెంబర్లుగా ఎంపిక చేసుకోవచ్చని, వారి సలహాలు, సూచనలు తీసుకోవచ్చని చెప్పింది. కరోనా నేపథ్యంలో ఈనెల 8న తొలి సమావేశం వర్చువల్ విధానంలో జరిగే అవకాశం ఉంది.