ఐయాం సారీ..! కుప్పంలో చంద్రబాబు పశ్చాత్తాపం..

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఓసారి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. కరోనా తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. తీరా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆయన నేరుగా కుప్పం వచ్చారు. తాను వెళ్లినా, వెళ్లకపోయినా, కుప్పంలో టీడీపీకి ఎదురే లేదని భావించిన బాబు, తొలిసారిగా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఆందోళన పడ్డారు. కుప్పంలో పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు మకాం వేశారు. తొలిరోజు పర్యటన ఇలా సాగింది.. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై […]

Advertisement
Update:2021-02-26 01:50 IST

2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఓసారి సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. కరోనా తర్వాత అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. తీరా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఆయన నేరుగా కుప్పం వచ్చారు. తాను వెళ్లినా, వెళ్లకపోయినా, కుప్పంలో టీడీపీకి ఎదురే లేదని భావించిన బాబు, తొలిసారిగా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఆందోళన పడ్డారు. కుప్పంలో పార్టీ పరిస్థితిని సమీక్షించేందుకు మకాం వేశారు.

తొలిరోజు పర్యటన ఇలా సాగింది..
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై జూమ్ లో ఎలా స్పందించారో సరిగ్గా.. కుప్పంలో తొలిరోజు పర్యటనలో కూడా అలాగే స్పందించారు చంద్రబాబు. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని, అయినా టీడీపీ శ్రేణులు ధీటుగా ఎదుర్కొన్నాయని, ఇదే పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. ఇక కుప్పం నియోజకవర్గాన్ని, ప్రజలను టార్గెట్ చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని సీఎం జగన్ పై మండిపడ్డారు. కనీసం నీరివ్వకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు రాజధర్మం పాటించానని చెప్పుకొచ్చారు.

ఐయాం సారీ..
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటలూ రాష్ట్రం కోసమే పనిచేశానని, అందువల్లే కుప్పంని పట్టించుకోలేకపోయానని అన్నారు చంద్రబాబు. స్థానిక నాయకులను, కార్యకర్తలను విస్మరించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇకపై అలా జరగదని, పార్టీకి జవసత్వాలు అందిస్తానని హామీ ఇచ్చారు బాబు. సంక్షోభ సమయంలో కార్యకర్తలకు అండగా ఉంటానని, కుప్పం నియోజకవర్గానికి సమర్థ నాయకత్వాన్ని అందిస్తానని చెప్పారు. పోరాడే కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దుతామని, పార్టీకి కొత్త రక్తం ఎక్కించి అధికారంలోకి తీసుకొస్తామని చెప్పారు. అలిపిరి దాడిలో 24 క్లెమోర్ ‌మైన్ ‌లకే తాను భయపడలేదని, ఇప్పుడు వైసీపీ నాయకుల తాటాకు చప్పుళ్లకు బెదురుతానా? అంటూ ప్రశ్నించారు. పార్టీని నిలబెడతానని భరోసా ఇచ్చారు.

కుప్పంలోనూ జమిలి జపం..
వైసీపీ పని అయిపోతోంది, మనపై సింపతీ పెరుగుతోంది.. ఇదీ ఏడాదిన్నరగా చంద్రబాబు కార్యకర్తలకు చేస్తున్న ఉద్బోధ. దీని ఫలితం పంచాయతీ ఎన్నికల్లో చూడండి అంటూ చెప్పిన చంద్రబాబు, తీరా ఫలితాలు చూసి కంగు తిన్నారు. అయినా సరే, ఆయన మాట మారలేదు. తాజాగా కుప్పంలో కూడా అదే మాట చెప్పారు. ఏడాదిన్నరలో జమిలి ఎన్నికలు వస్తే వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్లడం ఖాయమని, ఆ పార్టీ నైతికంగా పతనమైందని.. ప్రజలు తిరుగుబాటు చేస్తే అధికార పార్టీ నాయకులు పారిపోతారని అన్నారు. స్థానిక ఎన్నికలొస్తున్నాయంటూ కార్యకర్తల్ని ఉత్సాహపరిచిన చంద్రబాబు, ఇప్పుడు జమిలి ఎన్నికలకోసం ఎదురు చూడండి అంటూ వారిలో మరింత ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు.

Tags:    
Advertisement

Similar News