తమిళనాట శశి'కల' నెరవేరేనా..?

అమ్మ తర్వాతి స్థానం చిన్నమ్మదేనంటూ కలలుకన్న శశికళ వ్యవహారం జైలు జీవితంతో పరిసమాప్తమైందని అనుకున్నారంతా. ఓ దశలో కరోనాతో అంపశయ్యపై చేరుకుందని, కోలుకుని బయటపడ్డా.. మునుపటి పోరాటం ఉండదని సంబరపడ్డాయి వైరిపక్షాలు. కానీ చెన్నైలో చిన్నమ్మ ఎంట్రీ తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచల‌య్యాయి. కనీసం కారుపై అన్నాడీఎంకే జెండాని కూడా పీకే ధైర్యం చేయలేకపోయింది అధికార పక్షం. గుర్తుపై గొడవ చేసినా, పంచాయతీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున గెలిచిన ఓ వీరాభిమాని “కారునాదే, గుర్తు నాదే” అని […]

Advertisement
Update:2021-02-09 02:43 IST

అమ్మ తర్వాతి స్థానం చిన్నమ్మదేనంటూ కలలుకన్న శశికళ వ్యవహారం జైలు జీవితంతో పరిసమాప్తమైందని అనుకున్నారంతా. ఓ దశలో కరోనాతో అంపశయ్యపై చేరుకుందని, కోలుకుని బయటపడ్డా.. మునుపటి పోరాటం ఉండదని సంబరపడ్డాయి వైరిపక్షాలు. కానీ చెన్నైలో చిన్నమ్మ ఎంట్రీ తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచల‌య్యాయి. కనీసం కారుపై అన్నాడీఎంకే జెండాని కూడా పీకే ధైర్యం చేయలేకపోయింది అధికార పక్షం. గుర్తుపై గొడవ చేసినా, పంచాయతీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున గెలిచిన ఓ వీరాభిమాని “కారునాదే, గుర్తు నాదే” అని హూంకరించడంతో పోలీసులు సైతం వెనక్కి తగ్గారు. అది మొదలు.. చెన్నైలో శశికళ ఎంట్రీ, ఎంజీఆర్ హౌస్ లోకి పునరాగమనం.. అంతా సందడిగా సాగింది. అధికార పక్ష నేతలు విస్తుపోయి చూడటం మినహా చేయగలిగిందేమీ లేదని రుజువు చేసింది శశికళ.

బిక్కచిక్కిపోయిన పన్నీర్, పళని..
శశికళను పార్టీలోకి తిరిగి తీసుకొస్తే.. గుడారంలోకి ఒంటెను ఆహ్వానించినట్టేనని పళని స్వామి, పన్నీర్ సెల్వంకు బాగా తెలుసు. మొదట మెడ దూర్చే సందు కోరి, ఆ తర్వాత గుడారంలోనుంచి ఆ ఇద్దర్నీ ఆమె తరిమేస్తుందని వారి భయం, బాధ. సహజంగా పన్నీర్, పళనికి శశికళతో నేరుగా ఫైట్ చేసేంత ధైర్యం లేదు కానీ, బీజేపీ అండతోనే వారిద్దరూ కాస్త బెట్టు చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుందనుకున్న సమయంలో పాత కేసులు తిరగదోడి ఆమెను జైలుపాలు చేసిన ఘనత దక్కించుకున్న బీజేపీ, ఏదోరకంగా తమను ఒడ్డునపడేయకపోతుందా, చిన్నమ్మ రాజకీయ జీవితానికి చరమగీతం పాడకపోతుందా అనేది వారి ఆశ.

పార్టీపై పెత్తనం దక్కేనా..?
పార్టీ తరపున గెలిచిన వారికి, పార్టీ కార్యకర్తలకే జెండాపై హక్కు ఉంటుందని, పార్టీనుంచి సస్పెండ్ అయిన శశికళ, అన్నాడీఎంకే జెండాని వాడితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు అధికార పార్టీ ఫిర్యాదు చేసింది. సాక్షాత్తూ సీఎం పళనిస్వామి సైతం ఆమె కారుపై జెండా కనపడకూడదంటూ అనధికారిక ఆజ్ఞలు జారీ చేశారు. కానీ చివరకు ఏమైంది, ఓ స్థానిక నాయకుడిని అడ్డు పెట్టుకుని జెండాతోనే గర్వంగా చెన్నైలో అడుగు పెట్టారు శశికళ. ఇలాంటి స్థానిక నాయకులు ఎంతమంది శశికళ వెంట ఉన్నారో లెక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి. చిన్నమ్మపై అభిమానం ఉన్నవారు చాలామందే అన్నాడీఎంకేలోనూ ఉన్నారు. కానీ వారంతా సమయం కోసం ఎదురు చూస్తున్నారు. చిన్నమ్మ పార్టీలోకి ఎంటరైతే వెంటనే ప్లేటు ఫిరాయిస్తారు వీరంతా. గల్లీ స్థాయి నాయకులనుంచి, కొంతమంది కేబినెట్ మంత్రులు కూడా చిన్నమ్మ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తే.. తమకి తాము రాజకీయ సమాధి కట్టుకున్నట్టేనని పన్నీర్, పళని బాధ పడుతున్నారు. బీజేపీ అండకోసం ఎదురు చూస్తున్నారు.

చిన్నమ్మ ఇప్పుడేం చేస్తారు..?
అన్నాడీఎంకే పార్టీ గుర్తు కోసం చిన్నమ్మ ఆల్రడీ కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు. పదే పదే జయలలిత పేరు ప్రస్తావిస్తూ అమ్మ అభిమానులందర్నీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే ఊపులో పన్నీర్, పళనిని కూడా మంచి చేసుకుంటే పార్టీలోకి తిరిగి ఎంట్రీ ఇవ్వొచ్చనేది ఆమె ఆలోచన. జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చారు కాబట్టి.. శశికళ ప్రత్యక్షంగా పోటీలో దిగడానికి న్యాయపరమైన చిక్కులున్నాయి. ఈ దశలో ఆమెకు కనీసం పార్టీపై పెత్తనం అప్పగిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. సర్వేలన్నీ డీఎంకేకి పట్టం కడుతున్న వేళ, కనీసం చిన్నమ్మ ఎంట్రీతో అయినా అన్నాడీఎంకే దశ తిరుగుతుందని పన్నీర్, పళని భావిస్తే.. వారితోపాటు, చిన్నమ్మకి కూడా బీజేపీ ఆశీస్సులుంటే.. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలుంటాయి. ఇదే జరక్కపోతే.. అన్నాడీఎంకే అంతర్గత పోరాటాలకే పరిమితం అవుతుంది, డీఎంకే గ్యారెంటీగా ముఖ్యమంత్రి పీఠాన్ని ఎత్తుకుపోతుంది.

Tags:    
Advertisement

Similar News