వెల్లంపల్లిని కాలితో తన్నిన బీద రవిచంద్ర, సత్యనారాయణరాజు

ఏపీ శాసనమండలిలో అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, సత్యనారాయణరాజులు … మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేశారు. మంత్రిని బీద రవిచంద్ర కాలితో తన్నారు. దాంతో పరస్పరం సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. నారా లోకేష్ శానసమండలిలో సెల్ ఫోన్‌ ద్వారా ఫొటోలు తీస్తుండడంతో మంత్రులు అభ్యంతరం తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఫొటోలు తీయవద్దని డిప్యూటీ చైర్మన్ ఆదేశించినా నారా లోకేష్ వినలేదు. దాంతో మంత్రులు ఆగ్రహం వ్యక్తం […]

Advertisement
Update:2020-06-18 01:45 IST

ఏపీ శాసనమండలిలో అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, సత్యనారాయణరాజులు … మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేశారు. మంత్రిని బీద రవిచంద్ర కాలితో తన్నారు. దాంతో పరస్పరం సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది.

నారా లోకేష్ శానసమండలిలో సెల్ ఫోన్‌ ద్వారా ఫొటోలు తీస్తుండడంతో మంత్రులు అభ్యంతరం తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఫొటోలు తీయవద్దని డిప్యూటీ చైర్మన్ ఆదేశించినా నారా లోకేష్ వినలేదు. దాంతో మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోనే టీడీపీ సభ్యులు బీద రవిచంద్ర, సత్యనారాయణరాజులు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పైకి దూసుకొచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్‌ను బీద రవిచంద్ర కాలితో తన్నారు.

అధికార, విపక్ష సభ్యుల మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇంతలో శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేశారు డిప్యూటీచైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం. నిరవధిక వాయిదా ప్రకటన చేసి ఆయన వెళ్లిపోయారు. మండలి చైర్మన్ తీరు అప్రజాస్వామికంగా ఉందని మంత్రులు మీడియా ముందు అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం ద్రవ్యవినిమయ బిల్లును కూడా ఆమోదించుకునే అవకాశం కూడా ఇవ్వకుండానే సభను నిరవధికంగా వాయిదా వేశారని మంత్రులు విమర్శించారు.

మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లు, ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించకుండానే సభను నిరవధికంగా వాయిదా వేసుకునివెళ్లిపోయారు. అంతకు ముందు కూడా మండలిలో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏ బిల్లులను ముందు ప్రవేశపెట్టాలన్న దానిపై ఇరు పక్షాలు వాగ్వాదానికి దిగాయి.

బిల్లులను చేపట్టడంలో గత సంప్రదాయాలను పాటించాలని మంత్రులు బుగ్గన, బొత్స సత్యనారాయణ మండలి డిప్యూటీ చైర్మన్‌ను కోరారు. అయితే టీడీపీ ఇందుకు అభ్యంతరం తెలిపింది. ముందు ద్రవ్యవినిమయ బిల్లుపైనే చర్చించాలని… ఆ తర్వాతే మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను చేపట్టాలని పట్టుబట్టారు.

ఈ సమయంలో డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలపైనా మంత్రులు అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగ సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం… డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న తన భద్రతను ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. తాము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత తిరిగి భద్రత కల్పించారని వ్యాఖ్యానించారు. చైర్‌లో ఉన్న రెడ్డి సుబ్రమణ్యం ఇలా ప్రభుత్వాన్ని విమర్శించడంపై బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌గా ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని… మండలిలో ఇదో దుర్దినం అని వ్యాఖ్యానించారు.

డిప్యూటీ చైర్మన్‌ ప్రభుత్వాన్ని విమర్శించడంపై ఇతర మంత్రులు కూడా అభ్యంతరం తెలిపారు. దాంతో డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం… ఎదురుదాడి చేశారు. గతంలో చైర్మన్‌ను చుట్టుముట్టిన రోజే అసలైన దుర్దినం అని మంత్రులను విమర్శించారు.

ఏ బిల్లును ముందు చేపట్టాలన్న దానిపై ఇరుపక్షాలు ఒక అవగాహనకు రావాలని సూచించారు. ద్రవ్యవినిమయ బిల్లును ఆఖరిలో చేపట్టడం సాంప్రదాయమని బుగ్గన వివరించారు. గతంలో ఎప్పుడైనా ద్రవ్య వినిమయ బిల్లు తర్వాత వేరే బిల్లులు చేపట్టారా..? అని బొత్స నిలదీశారు. యనమల మాత్రం ద్రవ్య వినిమయ బిల్లునే ముందు చేపట్టాలని డిమాండ్ చేశారు.

దీంతో జోక్యం చేసుకున్న రెడ్డి సుబ్రమణ్యం… ఇప్పుడు కొత్త సంప్రదాయాన్ని ప్రారంభిస్తే తప్పేంటని అధికారపక్షాన్ని ప్రశ్నించారు. రూల్‌ 90 కింద టీడీపీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లు మండలిలో ఉన్నందున మరోసారి బిల్లు ప్రవేశపెట్టడానికి వీల్లేదని టీడీపీ అడ్డుపడింది.

ద్రవ్యవినిమయ బిల్లును తొలుత ప్రవేశపెడితే దాన్ని ఆమోదించి శాసనమండలిని నిరవధికంగా వాయిదా వేసుకుని వెళ్లే దురుద్దేశంతోనే టీడీపీ ఇలా… మూడు రాజధానుల బిల్లును ముందుగా ప్రవేశపెట్టకుండా అడ్డుపడుతోందని మంత్రులు అనుమానం వ్యక్తం చేశారు.

మంత్రులు అనుమానించినట్టుగానే తెలుగుదేశం పార్టీ తన బలాన్ని ఉపయోగించుకుని సభను నిరవధిక వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదించకుండానే సభను వాయిదా వేయడంపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సభను నిబంధనల ప్రకారం నడపాల్సిందిగా వేడుకోవాల్సిన దుస్థితి నేడు వచ్చిందన్నారు.

చైర్మన్‌ టీడీపీకి అనుకూలంగా పనిచేశారని మంత్రులు మండిపడ్డారు. రూల్ 90 కింద చర్చకు అవకాశం ఇవ్వాలంటే ఒకరోజు ముందు నోటీసులు ఇచ్చి ప్రభుత్వానికి తెలియజేసి చర్చకు అవకాశం ఇవ్వాలని… కానీ అవేవీ పాటించకుండా చర్చకు చైర్మన్‌ అవకాశం ఇచ్చారన్నారు. శాసనమండలిలో రూల్స్ ను ఫాలో అవుతున్నారా లేదా అని ప్రశ్నించారు.

ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకున్నారని దీని వల్ల ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు కూడా అవకాశం ఉండదని పిల్లి సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు. వ్యవస్థను విచ్చిన్నం చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు.

Tags:    
Advertisement

Similar News