రోడ్డుపైనే ప్రసవించిన వలస కార్మికురాలు
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు చిక్కుకొని పోయారు. అయితే చాలా మంది పనుల్లేక సొంతూర్లకు ప్రయాణమయ్యారు. హైదరాబాద్ నగరంలో కూడా లక్షలాది మంది వలస కార్మికులు ఉన్నారు. సొంతూర్లకు వెళ్లడానికి వీరికి తగిన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో లారీలో బయలుదేరారు. అలా బయలుదేరిన కార్మికురాలు ఒకరు మార్గమధ్యంలో రోడ్డుపై ప్రసవించింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో […]
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు చిక్కుకొని పోయారు. అయితే చాలా మంది పనుల్లేక సొంతూర్లకు ప్రయాణమయ్యారు. హైదరాబాద్ నగరంలో కూడా లక్షలాది మంది వలస కార్మికులు ఉన్నారు.
సొంతూర్లకు వెళ్లడానికి వీరికి తగిన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో లారీలో బయలుదేరారు. అలా బయలుదేరిన కార్మికురాలు ఒకరు మార్గమధ్యంలో రోడ్డుపై ప్రసవించింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
చత్తీస్‌గఢ్‌కు చెందిన అనితాబాయి తన భర్తతో పాటు మరో ఆరుగురితో కలసి హైదరాబాద్ నుంచి చత్తీస్‌గడ్‌లోని స్వగ్రామానికి బయలుదేరింది. ఒక లారీలో వీళ్లందరూ ప్రయాణమయ్యారు. కాగా, మెదక్ జిల్లా నార్సింగి మండలం జాప్తి శివనూర్‌కు చేరుకోగానే లారీలో ఉన్న అనితాబాయ్‌కి నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో లారీ డ్రైవర్ వాళ్లను అక్కడే దించేశాడు. భార్యభర్తలు దగ్గరలోని ఆసుపత్రికి వెళ్దామని కాలి నడకనే బయలుదేరారు. కాని రోడ్డు పక్కనే అనిత ప్రసవించింది.
రోడ్డు పక్కన మహిళ ప్రసవించిందని తెలుసుకున్న స్థానిక పోలీసులు ఆమెను, బిడ్డను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్లు చెప్పారు.
తాము హైదరాబాద్‌లోనే రెండు మూడు ఆసుపత్రులకు వెళ్లామని.. కాని కొత్త కేసులు ఏవీ తీసుకోవట్లేదని చెప్పడంతో సొంతూరికి వెళ్తే కనీసం తల్లిదండ్రులైనా కాన్పు చేస్తారని బయలు దేరినట్లు అనితాబాయి చెప్పింది.
మేము రైలులో వెళ్లడానికైనా పోలీసులు అనుమతి ఇచ్చుంటే ఇలా రోడ్డు పక్కన బిడ్డను కనే పరిస్థితి వచ్చేది కాదని ఆమె వాపోయింది. ఆ లారీలో ఇంకో గర్భవతి కూడా ఉందని అనిత చెప్పింది. మరోవైపు తమను ఆసుపత్రికి చేర్చిన పోలీసులు, ఎస్ఐ రాజేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.