31 వరకు తెలంగాణ లాక్‌డౌన్
అంటువ్యాదుల అత్యవసర చట్టం 1897 అమలు నిత్యావసరాలు తప్ప అన్నీ బంద్ రాష్ట్ర సరిహద్దులు మూసివేత ప్రకటించిన సీఎం కేసీఆర్ కరోనా మహమ్మారిపై పోరాటంలో మిగతా రాష్ట్రాల కంటే ఒకడుగు ముందే ఉన్న తెలంగాణ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రజల ఆరోగ్యాలను కాపాడాలంటే కరోనా వైరస్‌ను కట్టడి చేయడం ఒకటే మార్గం కనుక తెలంగాణ లాక్‌డౌన్ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతమైన నేపథ్యంలో ఇదే స్పూర్తిని మరి కొన్ని రోజులు […]
- అంటువ్యాదుల అత్యవసర చట్టం 1897 అమలు
- నిత్యావసరాలు తప్ప అన్నీ బంద్
- రాష్ట్ర సరిహద్దులు మూసివేత
- ప్రకటించిన సీఎం కేసీఆర్
కరోనా మహమ్మారిపై పోరాటంలో మిగతా రాష్ట్రాల కంటే ఒకడుగు ముందే ఉన్న తెలంగాణ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రజల ఆరోగ్యాలను కాపాడాలంటే కరోనా వైరస్‌ను కట్టడి చేయడం ఒకటే మార్గం కనుక తెలంగాణ లాక్‌డౌన్ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
ఆదివారం జనతా కర్ఫ్యూ విజయవంతమైన నేపథ్యంలో ఇదే స్పూర్తిని మరి కొన్ని రోజులు చూపించాలని ఆయన తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రగతి భవన్‌లో కరోనాపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత అక్కడ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
తెలంగాణ ప్రజలు నా మాటకు గౌరవించి ఇండ్లలోనే ఉన్నందుకు అభినందనలు తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరాడటానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని… దానిలో భాగంగానే అంటువ్యాదుల నివారణ అత్యవసర చట్టం 1897ను వెంటనే అమలు చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు ఈ నెల 31 వరకు తెరవొద్దని ఆయన అన్నారు. దీంతో పాటు బస్సులు, రైళ్లు, క్యాబులు, ఆటోలు కూడా పూర్తిగా బంద్ చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. నిత్యావసర సరుకుల కోసం ఇంటికి ఒకరిని మాత్రం బయటకు అనుమతిస్తామని.. బయటకు వచ్చే వాళ్లు గుంపులుగా ఉండొద్దని.. మనిషికి మనిషికి మధ్య 3 మీటర్ల దూరం పాటించాలని కేసీఆర్ చెప్పారు.
ఇక పేదలు, రోజు కూలీలకు పనులన్నీ బంద్ అయితే బతకడం కష్టం కనుక తెల్ల రేషన్ కార్డుదారులకు మనిషికి 12 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం అందించనున్నామని, అలాగే ఇతర వస్తువులు కొనుక్కోవడానికి 1500 రూపాయలు కూడా ఇవ్వనున్నట్లు కేసీఆర్ తెలిపారు.
బియ్యానికి 1,103 కోట్ల రూపాయలు, నగదు పంపిణీకి 1,314 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని… ఇందుకోసం 2,417 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. లాక్‌డౌన్ కాలంలో ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని యాజమాన్యాలకు ఆయన ఆదేశించారు.
అంగన్ వాడీ కేంద్రాలు కూడా మూసేస్తున్నాం కాబట్టి దాని ద్వారా లబ్ది పొందే పిల్లలు, గర్బిణులు, బాలింతలకు సరుకులు ఇంటికే పంపే ఏర్పాటు చేస్తామన్నారు. ఇక తెలంగాణలో అన్ని పాఠశాలలు బంద్ చేస్తున్నామని…. ఉపాధ్యాయులకు పేపర్లు దిద్దే పని కూడా ఉండదు కనుక వాళ్లు ఇంటికే పరిమితం కావొచ్చని అన్నారు.
ఇక అత్యవసర సర్వీసులైన వైద్యం, విద్యుత్ తదితర శాఖల ఉద్యోగులు 100 శాతం హాజరు కావాలన్నారు. మిగతా శాఖల ఉద్యోగులు 20 శాతం చొప్పున రొటేషన్ పద్దతిలో కార్యాలయాలకు హాజరవుతారని సీఎం తెలిపారు.
తెలంగాణ సరిహద్దులను పూర్తిగా మూసేస్తున్నామని.. ఏ వాహనాన్ని కూడా రాష్ట్రంలోనికి అనుమతించమని ఆయన చెప్పారు. కేవలం మనకు నిత్యావసర సరుకులు తీసుకొని వచ్చే గూడ్స్ వెహికిల్స్ తప్ప మరే ఇతర వాహనాన్ని రాష్ట్రంలోని అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. మరో రెండు గంటల్లో దీనికి సంబంధించిన పూర్తి జీవో వెలువడుతుందని కేసీఆర్ అన్నారు.
వైద్యులను మనం ఇప్పుడు కాపాడు కోవాలి. వారిపై పని ఒత్తిడి లేకుండా చేయాలి కనుక.. అత్యవసరమైన సర్జరీలు తప్ప మిగతా ఆపరేషన్ లన్నీ వాయిదా వేస్తున్నామని అన్నారు. గర్భిణుల జాబితాను తయారు చేస్తున్నామని.. వారందరినీ ఎల్లవేళలా పర్యవేక్షించి.. పూర్తిగా వారి బాధ్యతను ప్రభుత్వం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. వారికోసం అమ్మఒడి అంబులెన్సులను పూర్తి స్థాయిలో సిద్దం చేస్తున్నామని అన్నారు.
ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలందరూ సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా జిల్లా అధికారులకు రిపోర్టు చేయాలని కోరారు.