క్రికెట్ కూ తప్పని కరోనా దెబ్బ

ఖాళీ స్టేడియాలలోనే ఇక క్రికెట్ మ్యాచ్ లు జనం లేకుండానే ఐపీఎల్ మ్యాచ్ లు క్రీడలకూ, అభిమానులకూ అవినాభావ సంబంధం ఉంది. క్రికెట్, ఫుట్ బాల్, హాకీ, టెన్నిస్…క్రీడలు ఏవైనా జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్ లు జరుగుతున్నాయంటే చాలు..అభిమానులతో స్టేడియాలు కిటకిటలాడటం, నిండుకుండల్లా మారిపోవడం మనకు తెలుసు. అయితే ..ప్రపంచానే వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో.. భారత క్రీడారంగం సైతం ముందుజాగ్రత్త చర్యలకు దిగింది. భారీగా జనం గుమికూడే ప్రాంతాలకు కరోనా వైరస్ తేలికగా వ్యాపించే ప్రమాదం […]

Advertisement
Update:2020-03-13 03:43 IST
  • ఖాళీ స్టేడియాలలోనే ఇక క్రికెట్ మ్యాచ్ లు
  • జనం లేకుండానే ఐపీఎల్ మ్యాచ్ లు

క్రీడలకూ, అభిమానులకూ అవినాభావ సంబంధం ఉంది. క్రికెట్, ఫుట్ బాల్, హాకీ, టెన్నిస్…క్రీడలు ఏవైనా జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్ లు జరుగుతున్నాయంటే చాలు..అభిమానులతో స్టేడియాలు కిటకిటలాడటం, నిండుకుండల్లా మారిపోవడం మనకు తెలుసు.

అయితే ..ప్రపంచానే వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బతో.. భారత క్రీడారంగం సైతం ముందుజాగ్రత్త చర్యలకు దిగింది. భారీగా జనం గుమికూడే ప్రాంతాలకు కరోనా వైరస్ తేలికగా వ్యాపించే ప్రమాదం ఉండడంతో… జనం రాకను నివారించడానికి పలురకాల జాగ్రత్తలు తీసుకొంటోంది.

కేంద్రప్రభుత్వం, కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికలు, సలహాలు,సూచనలూ తూచతప్పక పాటించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే…ఖాళీ స్టేడియాలలోనే క్రికెట్, ఫుట్ బాల్ మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

సఫారీలతో సిరీస్ తో ప్రారంభం…

భారత్- సౌతాఫ్రికాజట్ల తీన్మార్ వన్డే సిరీస్ లోని తొలిమ్యాచ్ వానదెబ్బతో రద్దుల పద్దులో చేరిపోయింది. ధర్మశాల వన్డే…ఒక్కబంతీ పడకుండానే రద్దు కావడం… ఇదే సమయంలో కరోనా వైరస్ కేసులు 73కు పైగా బయటపడడంతో…ఏప్రిల్ 15 వరకూ విదేశీయులకు వీసాలు ఇవ్వరాదంటూ భారతప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి వీలుగా…దేశంలోని క్రీడాసంఘాలకు సైతం ముందస్తుగా ఆదేశాలు జారీచేసింది. మ్యాచ్ లు జరిగే సమయంలో జనానికి అనుమతి ఇవ్వరాదని, గేట్లు మూసి, ఖాళీ స్టేడియాలలో మాత్రమే మ్యాచ్ లు నిర్వహించాలని సూచించింది.

లక్నో, కోల్ కతాలలో ఖాళీ క్రికెట్….

సౌతాఫ్రికాతో మార్చి 15 న లక్నో, మార్చి 18న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన భారత్- సౌతాఫ్రికా ఆఖరి రెండువన్డే మ్యాచ్ లనూ జనాన్ని అనుమతించకుండానే…ఖాళీ స్టేడియాలలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుపొందిన ఈడెన్ గార్డెన్స్ లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగితే 50 వేల నుంచి 80 వేల మంది వరకూ అభిమానులు హాజరుకావడం మామూలు విషయం. అయితే …స్టేడియంలో ఒక్క అభిమానీ లేకుండా తొలిసారిగా మ్యాచ్ నిర్వహించడానికి రంగం సిద్దమయ్యింది.

మీడియా, టీవీ సిబ్బందికి మాత్రమే అనుమతి…

క్రికెట్ మ్యాచ్ లు జరిగే సమయంలో టీవీ ప్రత్యక్షప్రసారాల బృందాన్ని, మీడియా కవరేజ్ కు వచ్చే జర్నలిస్టుల్ని, మ్యాచ్ లో తలపడే రెండుజట్ల సభ్యులను మాత్రమే అనుమతించనున్నారు.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగే సమయంలో…ఒక్కో మ్యాచ్ కు 30 నుంచి 60 కోట్ల రూపాయల వరకూ ఆదాయం రావడం సాధారణం. అయితే …ఖాళీ స్టేడియాలలో మ్యాచ్ లు నిర్వహించడం ద్వారా ఆయా క్రికెట్ సంఘాలు భారీమొత్తంలో నష్టపోనున్నాయి. క్రికెట్ ను కేవలం ప్రత్యక్ష ప్రసారాలకు మాత్రమే పరిమితం చేయడం… కరోనా వైరస్ దృష్ట్యా ఆహ్వానించదగిన పరిణామమే.

ఖాళీ స్టేడియాలలోనే ఐపీఎల్…

రాజ్ కోటలోని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా బెంగాల్- సౌరాష్ట్ర్ర జట్ల మధ్య జరుగుతున్నరంజీ ట్రోఫీ ఐదురోజుల పైనల్స్ ఆఖరి రోజు ఆటను సైతం.. ఖాళీ స్టేడియంలోనే నిర్వహించాలని, అభిమానులకు అనుమతి లేదని సౌరాష్ట్ర్ర క్రికెట్ సంఘం ప్రకటించింది.

మరోవైపు…మార్చి 29 నుంచి ముంబై వాంఖెడీస్టేడియం వేదికగా ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 13వ సీజన్ మ్యాచ్ ల భవితవ్యాన్ని నిర్ణయించడానికి…బ్రిజేశ్ పటేల్ నాయకత్వంలోని ఐపీఎల్ పాలకమండలి..అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది.

ఏప్రిల్15 వరకూ విదేశీయులకు వీసాలు ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయించడంతో…కేవలం స్వదేశీ క్రికెటర్లతో మాత్రమే…ఖాళీ స్టేడియాలలోనే మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉంది.

ఖాళీస్టేడియంలోనే సాకర్ లీగ్ ఫైనల్స్…

మడ్గావ్ లోని జవహర్ లాల్ నెహ్రూ సాకర్ స్టేడియం వేదికగా మార్చి 14న జరగాల్సిన ఇండియన్ సూపర్ లీగ్ ఫైనల్స్ ను సైతం ఖాళీ స్టేడియంలోనే నిర్వహించనున్నారు.

ఈ పోటీలో అథ్లెటికో డీ కోల్ కతా- చెన్నైయాన్ ఫుట్ బాల్ క్లబ్ జట్లు ఢీ కొనబోతున్నాయి. ప్రపంచ క్రీడాచరిత్రలోనే అంతర్జాతీయ ఫుట్ బాల్, క్రికెట్ మ్యాచ్ లను ఖాళీ స్టేడియాలలో నిర్వహించడం బహుశా ఇదే తొలిసారిగా రికార్డుల్లో చేరనుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే….ఖాళీ స్టేడియాల మంత్రం తప్పదు మరి.

Tags:    
Advertisement

Similar News