ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. ఫిబ్రవరి 5న పోలింగ్
70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ ఏడాది ఫిబ్రవరి 23తో ముగియనున్న గడువు
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. 70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీకి ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనన్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్ వెల్లడించారు. జనవరి 10 నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్లు సమర్పించడానికి జనవరి 17 చివరి తేదీ. జనవరి 18న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 20 చివరి తేదీ. ఫిబ్రవరి 5 పోలింగ్, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని సీఈసీ తెలిపింది.
70 నియోజకవర్గాలున్న ఢిల్లీలో ఇందులో 58 జనరల్ స్థానాలు కాగా,12 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం ఓటర్లు 1.55 కోట్ల ఓట్లర్లున్నారు. ఇందులో 83.49 లక్షలు పురుషులు, 71.74 లక్షల మంది మహిళలు, 25.89 లక్షల మంది యువత, 2.08 లక్షల కొత్త ఓటర్లున్నారు. 79,436 మంది దివ్యాంగ ఓటర్లు, 1,261 మంది ట్రాన్స్‌జెండర్స్ ఓటర్లున్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ అందుబాటులోల ఉంచనున్నట్లు పేర్కొన్నారు. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపింది.
ఈవీఎం ట్యాంపరింగ్‌పై స్పష్టత
ఈ సందర్భంగా ఈవీఎం ట్యాంపరింగ్, ఓటర్ల జాబితాలో అవకతవకలు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై సీఈసీ రాజీవ్‌కుమార్ స్పష్టతనిచ్చారు. ఓటింగ్‌లో మనం కొత్త రికార్డులు సృష్టిస్తున్నాం. మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నది. త్వరలోనే దేశంలో ఓటర్ల సంఖ్య 100 కోట్లను దాటనున్నది. అయితే, ఎన్నికల ప్రక్రియపై కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఓటరు జాబితాను సిద్ధం చేసే ప్రతి దశలో రాజకీయపార్టీలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం. ఇది పూర్తిగా పారదర్శకమైన ప్రక్రియ. ఓటరు జాబితాలో పేర్ల చేరిక, తొలిగింపులకు సంబంధించి విధివిధానాలను పాటిస్తున్నాం. ఇందులో అవకతవలకు ఆస్కారం లేదని రాజీవ్ కుమార్ తెలిపారు.
ఇటీవల చాలా రాష్ట్రాల్లో చిన్నపార్టీలు మెజారిటీ సాధించాయి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం వల్లనే అనూహ్య ఫలితాలు వచ్చాయన్నారు. కాబట్టి ఈవీఎంలపై సందేహాలు అక్కరలేదు. ర్యాండమ్‌గా వీవీప్యాట్‌లలోని స్లిప్‌లను లెక్కింపు చేస్తున్నాం. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపులో ఇప్పటివరకు ఎక్కడా తేడా రాలేదన్నారు. ట్యాంపరింగ్ జరుగుతుందనేది నిరాధార ఆరోపణ అన్నారు. పోలింగ్ శాతం పెరుగుదలపైనా తప్పుడు ప్రచారం జరుగుతున్నదన్నారు. పోలింగ్ సమయం ముగిసేటప్పటికి జరిగిన పోలింగ్ శాతం ఒకసారి ప్రకటిస్తున్నాం. పోలింగ్ సమయం ముగిశాక క్యూలో ఉన్నవారు ఓటు వేస్తున్నారు. కొన్నిచోట్ల రాత్రి 8 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతున్నది. పోలింగ్ శాతంపై చివరి లెక్కలు ఆలస్యంగా వస్తున్నాయి.పోలింగ్ శాతాన్ని ఎవరూ మార్చలేరన్నారు. ఇక ఇప్పటికే అధికార ఆప్ 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కొన్ని స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాయి.