నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం
కొత్త ఏడాదిలో ఎన్నికల సందడి మొదలవనున్నది. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించనున్నది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించనున్నది.70 శాసనసభ స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ ఏడాది ఫిబ్రవరి 23తో గడువు ముగియనున్నది. ఆలోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. అంటే వచ్చే నెల మొదటివారంలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయి. గతంలో 2020లో ఫిబ్రవరి 8న ఓటింగ్ నిర్వహించి అదే నెల 11న ఫలితాలను ప్రకటించారు. సాధారణంగా ఇక్కడ ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తారు.
ప్రస్తుత అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీ సంఖ్యాబలం 8గా ఉన్నది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న ఆప్ వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి హాట్రిక్ కొట్టాలని చూస్తున్నది. అటు ఆప్‌ను అడ్డుకుని కేంద్ర పాలిత ప్రాంతంలో పాగా వేయాలని బీజేపీ వ్యూహ రచన చేస్తున్నది. ఇప్పటికే ఆప్ 70 మంది అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ కూడా కొన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశాయి.