జాతీయ గీతం ఆలపించలేదని.. గవర్నర్‌ వాకౌట్‌!

తమిళనాడు అసెంబ్లీలో ఘటన

Advertisement
Update:2025-01-06 19:07 IST

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం తమిళనాడు విధాన సభకు గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి వచ్చారు. స్పీకర్‌, అసెంబ్లీ అధికారులు, ప్రభుత్వం తరపున ఆయనను సీఎం స్టాలిన్‌ ఆయనను గౌరవంగా సభలోకి తీసుకువచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ముందు తమిళనాడు రాష్ట్ర గీతం తమిళ్‌ థాయ్‌ వాల్తూ, ప్రసంగం ముగిసిన తర్వాత జాతీయ గీతం ఆలపించడం ఆనవాయితీ. తన ప్రసంగానికి ముందు, తర్వాత రెండుసార్లు జాతీయ గీతం ఆలపించాలని రవి కోరారు. తమిళనాడు ప్రభుత్వం, లెజిస్లేటివ్‌ అధికారులు రాష్ట్ర గీతం ఆలాపన తర్వాత జాతీయ గీతాన్ని అసెంబ్లీలో ప్లే చేయలేదు. గవర్నర్‌ ప్రసంగంతో సభను ప్రారంభించే ప్రయత్నం చేశారు. ఈ చర్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ రవి ప్రసంగం చేయకుండానే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. దీంతో సభ నుంచి గవర్నర్‌ వాకౌట్‌ చేశారని సోషల్‌ మీడియాలో చర్చోపచర్చలు చేస్తున్నారు. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తర్వాత గవర్నర్ రవి 'ఎక్స్‌' వేదికగా స్పందిస్తూ.. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణాలు ఎమర్జెన్సీ రోజులను తలపించాయని పేర్కొన్నారు. గవర్నర్‌ అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడంపై సీఎం స్టాలిన్‌ స్పందిస్తూ అది చిన్నపిల్లల చేష్టలా ఉందని మండిపడ్డారు. ఆయన అసెంబ్లీ నిబంధనలు, రాజ్యాంగాన్ని అవమానించారని తెలిపారు.

మొదటి నుంచి ఉప్పునిప్పులాగే గవర్నర్‌, సీఎం

తమిళనాడులో స్టాలిన్‌ ప్రభుత్వంతో గవర్నర్‌ రవికి ఏమాత్రం పొసగడం లేదు. ప్రభుత్వానికి, రాజ్‌ భవన్‌ కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వం తీసుకువచ్చిన కీలక బిల్లులు సహా అన్ని నిర్ణయాల్లోనూ గవర్నర్‌ అడ్డు తగులుతున్నారని డీఎంకే ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఒకానొక దశలో 'గెట్‌ ఔట్‌ రవి' అని డీఎంకే నేతలు గవర్నర్‌ కు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. ఆ తర్వాత రాజ్యాంగ పరమైన విధి నిర్వహణలో భాగంగా మాత్రమే గవర్నర్‌ ను కలుస్తున్నారు. ఈక్రమంలోనే అసెంబ్లీలో జనగణమన గీతాన్ని ఆలపించలేదని పేర్కొంటూ గవర్నర్‌ తన స్పీచ్‌ ను బాయ్‌ కాట్‌ చేసి వెళ్లిపోయారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులను తన ప్రసంగం ద్వారా చెప్పడం ఇష్టం లేకనే గవర్నర్‌ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని డీఎంకే ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం ఎలాంటి మలుపులకు దారితీస్తుందా అని రాజకీయ విమర్శలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News