తగ్గే ప్రసక్తే లేదంటున్న కేసీఆర్... రాత్రి సమీక్ష రద్దు
ఆర్టీసీ సమ్మె పట్ల కఠిన వైఖరినే అవలంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. చర్చలు జరపాలంటూ హైకోర్టు సూచించిన నేపథ్యంలో కేసీఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని భావించారు. శనివారం ఉదయం 10.30 గంటలకల్లా కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించండి అని హైకోర్టు శుక్రవారం సూచించింది. దాంతో శుక్రవారం రాత్రి ఆర్టీసీ సమస్యపై చర్చించేందుకు ఉన్నతాధికారులను సమీక్షకు కేసీఆర్ పిలిపించారు. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, […]
ఆర్టీసీ సమ్మె పట్ల కఠిన వైఖరినే అవలంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. చర్చలు జరపాలంటూ హైకోర్టు సూచించిన నేపథ్యంలో కేసీఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని భావించారు. శనివారం ఉదయం 10.30 గంటలకల్లా కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించండి అని హైకోర్టు శుక్రవారం సూచించింది. దాంతో శుక్రవారం రాత్రి ఆర్టీసీ సమస్యపై చర్చించేందుకు ఉన్నతాధికారులను సమీక్షకు కేసీఆర్ పిలిపించారు. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతో రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఉన్నతాధికారులు హుటాహుటిన ప్రగతి భవన్‌కు వెళ్లారు.
అప్పటికి కేసీఆర్ తాజ్ కృష్ణలో జరిగిన మెదక్ ఎస్పీ చందనదీప్తి వివాహానికి వెళ్లారు. తిరిగి రాగానే సమీక్ష ఉంటుందన్న ఉద్దేశంతో అధికారులు ప్రగతిభవన్‌లోనే ఎదురుచూశారు. కానీ తాజ్ కృష్ణ నుంచి వచ్చిన కేసీఆర్ అక్కడే ఉన్న అధికారులతో మాట్లాకుండానే నేరుగా లోనికి వెళ్లిపోయారు. అనంతరం ఎలాంటి సమక్ష లేదని అధికారులను తిరిగి వెళ్లిపోవాల్సిందిగా సీఎం సూచించారు. కేసీఆర్ ఇలా సమీక్షను రద్దు చేసుకోవడానికి కారణం ఉందని అధికారులు చెబుతున్నారు.
కార్మిక సంఘాలతో చర్చలు జరపాల్సిందిగా హైకోర్టు మౌఖికంగా సూచన మాత్రమే చేసిందని… ఆదేశించలేదని అధికారులు చెబుతున్నారు. హైకోర్టు కేవలం సూచన మాత్రమే చేసినందున దాన్ని తప్పనిసరిగా ఫాలో కావాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ సమీక్షను రద్దు చేసినట్టు చెబుతున్నారు. కార్మిక సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఏమాత్రం సుముఖంగా లేదని వివరిస్తున్నారు.
ఒకవేళ చర్చలు జరపాల్సిందే అని హైకోర్టు ఆదేశిస్తే అప్పుడు ఆలోచన చేయవచ్చన్న ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు. కార్మిక సంఘాలకు ఒక్కసారి లొంగితే ఇక పాలనలో పట్టు తప్పడం ఖాయమని… మిగిలిన వారు కూడా ఇదే తరహాలో ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసేందుకు సిద్ధపడుతారని.. కాబట్టి ఆరునూరైనా సరే ఈ విషయంలో వెనక్కు తగ్గకూడదన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నట్టు చెబుతున్నారు.
పైగా హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేయడాన్ని కూడా కేసీఆర్ సానుకూల అంశంగా చూస్తున్నారు. తదుపరి విచారణకు ఇంకా పది రోజుల గడువు ఉంది కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదని… ఆలోచించే అడుగులు వేద్దామని కేసీఆర్ చెబుతున్నట్టు సమాచారం.
చర్చలు జరపాల్సిందిగా హైకోర్టు కేవలం మౌఖికంగా సూచనలు మాత్రమే చేసింది కాబట్టి… చర్చలకు అవకాశం ఉండకపోవచ్చని టీఆర్‌ఎస్ పత్రిక కూడా అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కారణంగా చర్చలు జరిపినా కార్మికుల డిమాండ్లను ఆమోదించే అవకాశం ఉండకపోవచ్చని కూడా వెల్లడించింది.