టీడీపీని మూసేస్తారా? " అనిల్ ఛాలెంజ్
రివర్స్ టెండరింగ్ వల్ల తమ బండారం బయటపడిపోతోందని చంద్రబాబు, టీడీపీ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. వందల కోట్లు మిగిలేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే అభినందించాల్సిందిపోయి విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జీవో 67 ప్రకారం సింగిల్ బిడ్ వస్తే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆ సింగిల్ బిడ్ కూడా ఎక్కువ ధరకు వేసినప్పుడు మాత్రమే రద్దు చేసేందుకు అవకాశం ఉంటుందని.. కానీ […]
రివర్స్ టెండరింగ్ వల్ల తమ బండారం బయటపడిపోతోందని చంద్రబాబు, టీడీపీ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. వందల కోట్లు మిగిలేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే అభినందించాల్సిందిపోయి విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
జీవో 67 ప్రకారం సింగిల్ బిడ్ వస్తే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆ సింగిల్ బిడ్ కూడా ఎక్కువ ధరకు వేసినప్పుడు మాత్రమే రద్దు చేసేందుకు అవకాశం ఉంటుందని.. కానీ తక్కువ మొత్తానికే పనులు చేసేందుకు ముందుకొచ్చినప్పుడు టెండర్ రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు. మేఘా సంస్థ పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుందన్నారు.
పోలవరం ప్రాజెక్టును టీడీపీ నేతలు చెప్పిన దాని కంటే ముందే పూర్తి చేస్తామని… అప్పుడు టీడీపీని మూసేస్తారా? అని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు విషయంలోనూ రివర్స్ టెండరింగ్ నిర్వహించి ప్రజధానాన్ని ఆదా చేస్తామన్నారు. చంద్రబాబు హాయాంలో వేల కోట్ల ప్రజాధనం వృథా చేశారన్నారు. నవంబర్ నుంచి పోలవరం పనులు ప్రారంభిస్తామని… రెండేళ్లలోపే ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు.
ఇప్పుడు కొత్తగా పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ తప్పుడు ప్రచారాన్ని టీడీపీ మొదలు పెట్టిందన్నారు. డిజైన్ ప్రకారమే పోలవరం నిర్మిస్తామని ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదన్నారు. మేఘా సంస్థ నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడబోదన్న విషయం చంద్రబాబుకు కూడా తెలుసన్నారు.
దేవినేని ఉమా నీతి నిజాయితీ అంటూ మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇరిగేషన్ శాఖ మీద జగన్ దాడి చేస్తున్నారని దేవినేని ఉమా అంటున్నాడని.. కానీ జగన్ దాడి చేస్తోంది టీడీపీ దోపిడి మీద అని అనిల్ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల బండారం మొత్తం బయటపడుతుందన్నారు.
పోలవరంపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లకపోయి ఉంటే ఇప్పుడు మిగిలిన 800 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లేవి అని ప్రశ్నించారు. నవయుగ కంపెనీ అంత మంచి కంపెనీ అయితే ఎందుకు బిడ్డింగ్‌లో పాల్గొనలేదని ప్రశ్నించారు.
నవయుగ లాంటి కంపెనీలు పారదర్శకంగా టెండర్లు ఆహ్వానించినప్పుడు ముందుకు రావని… అదే నామినేషన్ పద్దతి మీద అధిక మొత్తానికి అప్పగిస్తే మాత్రం ముందుకొస్తాయని అనిల్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నవయుగ అంత నిజాయితీగా ఉంటే టెండర్లలో ఎందుకు పాల్గొనలేదో టీడీపీనేతలు చెప్పాలని డిమాండ్ చేశారు.