రేపటి నుంచి ఏపీలో గ్రామ వాలంటీర్ల ఇంటర్య్వూలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనికి శ్రీకారం చుడుతున్నారు. గ్రామాల ప్రగతితో పాటు ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు నేరుగా చేరేందుకు ఏర్పాటు చేస్తామని చెప్సిన గ్రామ సచివాలయాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతోంది. ఇందులో భాగంగా గ్రామ వలంటీర్ల ఏర్పాటుకు గురువారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ ఒకేసారి సచివాలయ వాలంటీర్ల ఇంటర్య్వూలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,81, 885 గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలున్నట్లుగా […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనికి శ్రీకారం చుడుతున్నారు. గ్రామాల ప్రగతితో పాటు ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు నేరుగా చేరేందుకు ఏర్పాటు చేస్తామని చెప్సిన గ్రామ సచివాలయాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతోంది.
ఇందులో భాగంగా గ్రామ వలంటీర్ల ఏర్పాటుకు గురువారం నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ ఒకేసారి సచివాలయ వాలంటీర్ల ఇంటర్య్వూలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,81, 885 గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలున్నట్లుగా అధికారులు నిర్ణయించారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని 20 రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ లో ఇచ్చిన అర్హతలు, ఇతర అంశాల మేరకు గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు 7, 92,334 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు.
గురువారం ఉదయం నుంచి అన్ని మండలాల్లోని గ్రామాల్లోనూ ఇంటర్వ్యూలు ఒకేసారి చేపడతారు. ఇంటర్వ్యూలను 50 మార్కులకు చేపడతారు. సచివాలయ వాలంటీర్ల ఇంటర్య్వూల్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారికే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలలో 50 శాతం ఉద్యోగాలు మహిళలకు కేటాయించారు. అలాగే మైదాన ప్రాంతాలలో విద్యార్హతను ఇంటర్మీడియట్, గిరిజన ప్రాంతాలలో పదవ తరగతిని విద్యార్హతగా నిర్ణయించారు. గ్రామ వాలంటీర్ల ఎంపికలో పారదర్శక పాటించాలని, పార్టీలకు, పైరవీలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వరాదని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎంపికైన వాలంటీర్లకు పది రోజుల పాటు మండల స్ధాయిలో శిక్షణ ఇచ్చి అనంతరం పోస్టింగులు ఇస్తారు. వీరికి నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వనున్నారు. గ్రామ వాలంటీర్ల ఎంపికలో కాని, అనంతరం వారి విధులలో కాని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలాంటి జోక్యం చేసుకోకూడదని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
అలాగే వాలంటీర్లు కూడా తమ విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడినా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని కూడా సీఎం ఆదేశించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ లో ఈ నెలాఖరు నుంచి గ్రామ స్వరాజ్య పాలన ప్రారంభవుతుందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.